* జూబ్లీహిల్స్ కోటలో రేవంత్ రెడ్డి డైలాగులు.
*వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ వైఫల్యం.
*రుణమాఫీ ఎగ్గొట్టారు.. బోనస్ బోగస్ చేశారు.
*మూడు రోజుల్లో ధాన్యం కొనకపోతే రాస్తారోకోలు.
* కలెక్టరేట్ల ముట్టడికి హరీశ్ రావు పిలుపు.
సిద్దిపేట, మహా.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావుపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 20 రోజులుగా వడ్ల కుప్పల దగ్గరే పడిగాపులు కాస్తున్నా కొనే నాథుడు లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా, వారి సమస్యలను ఆలకించిన హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుని డైలాగులు కొట్టడం మానేసి, కల్లాల దగ్గరకు వచ్చి రైతుల గోస చూడాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రికి పట్టింపు లేదని, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు అవగాహన లేదని విమర్శించారు. 44, 45 డిగ్రీల భానుడి భగభగలకు రైతులు విలవిలలాడుతుంటే ప్రభుత్వానికి కనికరం లేకపోవడం విచారకరమన్నారు. రైతు బిడ్డనని చెప్పుకుంటూ దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా ప్రజలను వంచించిన రేవంత్ రెడ్డి, అసలైన రైతు ద్రోహి అని ధ్వజమెత్తారు. ఈ యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతుంటే, ఇప్పటివరకు పది పైసల వడ్లు కూడా కొనలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.
కొనుగోళ్లలో ప్రవేశపెట్టిన కొత్త విధానాలు, ఆన్‌లైన్ నిబంధనల పేరిట రైతులను చిత్రహింసలు పెడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఊళ్లోనే రైస్ మిల్లు ఉన్నా, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లులకు ధాన్యం పంపాలని ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం ఇస్తూ రవాణా ఖర్చుల భారం పెంచుతున్నారని విమర్శించారు. ఒక్కో సెంటర్‌లో ఐదారు జాలీలు ఉండాల్సి ఉండగా, కేవలం ఒక్కటే ఇచ్చి తాలు పేరిట అధికారులతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ వంటి జిల్లాల్లో ఐదారు కిలోల తరుగు పెడుతూ రైతుల కడుపు కొడుతున్నారని, తరుగు పెడితే తోలు తీస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరి తోలు తీస్తాడో చెప్పాలని నిలదీశారు.
బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడుతోందని హరీశ్ రావు మండిపడ్డారు. గత యాసంగిలో ఇస్తామన్న రూ. 1600 కోట్ల బోనస్‌ను ఎగ్గొట్టారని, ఈ యాసంగికి బోనస్ ఇస్తారో లేదో కూడా స్పష్టత ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కేవలం వడ్లు మాత్రమే కాకుండా సన్ ఫ్లవర్, శనగలు, మొక్కజొన్న, జొన్నల రైతులను కూడా ఈ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నకోడూరు, సిద్దిపేట మార్కెట్లలో సన్ ఫ్లవర్ రైతులు 20 రోజులుగా కుప్పల దగ్గరే పడుకుంటున్నారని, శనగల కొనుగోళ్లు సగంలోనే నిలిపివేసి రైతులను గాలికొదిలేశారని విమర్శించారు. జొన్నల కొనుగోలు కేంద్రాలే ప్రారంభించలేదని, ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు మద్దతు ధర కంటే తక్కువకే ప్రైవేటుకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
మొక్కజొన్న కొనుగోలుపై ప్రభుత్వం పెట్టిన కొత్త నిబంధనలను హరీశ్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. ఎకరానికి 26 క్వింటాళ్లే కొంటామనడం హాస్యాస్పదమని, కాళేశ్వరం నీళ్లతో ఎకరానికి 40-45 క్వింటాళ్లు పండుతుంటే మిగతా పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఎంత పండితే అంత, ఎటువంటి షరతులు లేకుండా మొక్కజొన్న, జొన్నలు, శనగలు, సన్ ఫ్లవర్ కొనుగోలు చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ నాయకులను తిట్టడం మీద ఉన్న శ్రద్ధ.. రైతుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రికి లేదని ఎద్దేవా చేశారు.
మూడు, నాలుగు రోజుల్లోగా ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించకపోతే జాతీయ రహదారుల దిగ్బంధం, కలెక్టరేట్ల ముందు వంటావార్పు కార్యక్రమాలు చేపడతామని హరీశ్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీసి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. అధికారులు తాలు, తేమ పేరిట ఇబ్బందులు పెడితే సహించబోమని, రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణరావుపేట మండల నేతలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.








