* 12 మంది ఐఎఫ్‌ఎస్‌ల స్థానచలనం.
* పలు జిల్లాల డీఎఫ్‌ఓల మార్పు.
* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర అటవీ శాఖలో పలువురు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పరిపాలనా సౌలభ్యం, అటవీ సంరక్షణ చర్యలను మరింత వేగవంతం చేసే ఉద్దేశ్యంతో మొత్తం 12 మంది ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారులకు స్థానచలనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలు జిల్లాల అటవీ అధికారులు (డీఎఫ్‌ఓ) సహా పలువురు సీనియర్ అధికారుల పోస్టుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
ఈ బదిలీల్లో భాగంగా దులపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో అదనపు డైరెక్టర్‌గా, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌గా (సీసీఎఫ్) విధులు నిర్వర్తిస్తున్న 2004 బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి ఎస్. రమేష్‌ను.. హైదరాబాద్‌లోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌గా (సీఎఫ్) బదిలీ చేశారు. అలాగే, దులపల్లి అటవీ అకాడమీలోనే జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న బి. ప్రవీణ (2016)ను ములుగు ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) డీన్‌గా నియమించారు.
పలు జిల్లాల అటవీ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల అటవీ అధికారిగా ఉన్న సీహెచ్. బాలమణి (2016)ని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారిగా పంపగా.. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌గా ఉన్న ఎస్. సత్యనారాయణను రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల నూతన అటవీ అధికారిగా నియమించారు. కామారెడ్డి డీఎఫ్‌ఓగా ఉన్న బొగ నిఖిత (2017) వరంగల్ జిల్లా డీఎఫ్‌ఓగా, వరంగల్ జిల్లా డీఎఫ్‌ఓగా ఉన్న అనుజ్ అగర్వాల్ (2020) ఖమ్మం జిల్లా డీఎఫ్‌ఓగా బదిలీ అయ్యారు.
వీరితో పాటు ఖమ్మం జిల్లా అటవీ అధికారిగా ఉన్న సిద్ధార్థ విక్రమ్ సింగ్ (2018) నిజామాబాద్ జిల్లా డీఎఫ్‌ఓగా వెళ్లగా.. నిజామాబాద్ డీఎఫ్‌ఓగా పనిచేస్తున్న వికాస్ మీనా (2017)ను ములుగు జిల్లాకు బదిలీ చేశారు. ములుగు జిల్లా డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్ (2018)ను మంచిర్యాల జిల్లా డీఎఫ్‌ఓగా నియమించారు. ఇక మంచిర్యాలలో పనిచేస్తున్న శివ ఆశీష్ సింగ్ (2018)ను మహబూబ్‌నగర్ జిల్లా అటవీ అధికారిగా బదిలీ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారిగా ఉన్న నీరజ్ కుమార్ తిబ్రేవాల్ (2019)ను కామారెడ్డి జిల్లా అటవీ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే, వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ఏసీఎఫ్), జిల్లా అటవీ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జి. జ్ఞానేశ్వర్‌కు స్థానచలనం కల్పించారు. ఆయనను తక్షణమే హైదరాబాద్‌లోని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆదేశించింది. సంబంధిత అధికారులంతా వెంటనే నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం పేర్కొంది.








