- రైతు గోస తగులుతుంది
- కాంగ్రెస్ సర్కార్ మొద్దునిద్ర వీడాలి
- మొలకెత్తిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి
- ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కన్నీరు
- కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ఫైర్
భువనగిరి, మహా : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్య వైఖరి వల్ల ధాన్యం కొనుగోలు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా కుప్పకూలిందని, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే అన్నదాతలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి మండలం హన్మాపూర్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బిజెపి కిసాన్ మోర్చా నాయకులతో కలిసి ఆయన పరిశీలించి, అక్కడి రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను వెల్లబోసుకుంటూ.. 10 రోజులుగా లారీలు రాక, కాంటాలు లేక, కనీసం టార్పాలిన్లు కూడా లేకపోవడంతో ధాన్యం కుప్పలు మొలకెత్తుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచంరద్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, నల్లగొండ జిల్లా బచ్చన్నగూడెం ఐకేపీ సెంటర్ ఇన్చార్జి కొప్పుల సైదులు మిల్లర్ల వేధింపులు, ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చింది. తన ప్రాణత్యాగంతో అయినా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి కొనుగోళ్లు సజావుగా సాగాలని ఆయన మాట్లాడి, అనంతరం ఆత్మహత్యాయత్నం చేయడం ప్రతి ఒక్కరినీ కలచివేసిందన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని.. మోదీ ప్రభుత్వం, బిజెపి మీకు అండగా ఉంటుందని రాంచందర్ రావు భరోసా కల్పించారు.
కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం ఎందుకు తాత్సారం చేస్తోంది?
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మద్దతు ధరతో పాటు ట్రాన్స్పోర్ట్, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, హమాలీ చార్జీలు, చివరికి ఐకేపీ సెంటర్ల కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. అయినప్పటికీ కొనుగోళ్లు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకి ఏంటి? అని ప్రశ్నించారు.
రైతు డిక్లరేషన్ ఉత్తదేనా?
వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, నేడు రైతులకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని విమర్శించారు. కనీసం టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో ధాన్యం మొలకెత్తి బరువు తగ్గిపోతోందని, దీనివల్ల రైతుకు గిట్టుబాటు ధర దక్కకుండా పోతోందని మండిపడ్డారు. హన్మాపూర్లో దాదాపు 80-100కి పైగా ధాన్యం కుప్పలు రాశులుగా పోసి రైతులు వేచి చూస్తున్నప్పటికీ, కొనుగోళ్ల విషయంలో అధికారులు కేవలం మాటలతో సరిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిల్లర్లు – దళారుల కుమ్మక్కు
రాష్ట్రంలో రైస్ మిల్లర్లు, దళారులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని రాంచందర్ రావు ఆరోపించారు. ఆదిలాబాద్లో మక్క రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని, మద్దతు ధర దేవుడెరుగు కనీసం కొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు చర్యలకు పాల్పడుతున్న మిల్లర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మొద్దునిద్ర వీడి మొలకెత్తిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి కనీస సదుపాయాలు కల్పించాలని, లారీలు, గన్నీ బ్యాగుల కొరతను వెంటనే తీర్చాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.
అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పోరాటాలు ఉధృతం చేస్తామని రాంచందర్ రావు హెచ్చరించారు.








