* గెలిచాక నేరుగా పనైయూర్‌కే రండి!.
* సంబరాలు వద్దు.. మీ కోసం నేనిక్కడే ఎదురుచూస్తుంటా.
*టీవీకే నేతలకు దళపతి విజయ్ ఆదేశాలు.
* రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న వ్యాఖ్యలు.
హైదరాబాద్, మహా.
తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్న ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) అధినేత, సినీ నటుడు దళపతి విజయ్ పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఘనవిజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. గెలిచిన తర్వాత అభ్యర్థులు, నేతలు ఎలా వ్యవహరించాలో ముందస్తుగానే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల టీవీకే పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
**గెలుపు తర్వాత పనైయూర్‌కే పయనం..**
సమావేశంలో నేతలను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతూ.. “రాబోయే ఎన్నికల్లో మనం కచ్చితంగా గెలుస్తామన్న పూర్తి నమ్మకం నాకుంది. అయితే, విజయం సాధించిన తర్వాత ఎవరూ మరెక్కడికీ వెళ్లొద్దు. మీ మీ నియోజకవర్గాల్లో ఎలాంటి సంబరాలు, విజయోత్సవ ర్యాలీలు ప్లాన్ చేసుకోవద్దు. గెలుపు ఖాయమైన వెంటనే నేరుగా పనైయూర్ (పార్టీ కేంద్ర కార్యాలయం)కు చేరుకోవాలి. ఇక్కడ మనం కలుసుకున్న తర్వాతే, మళ్లీ మీ నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలతో కలిసి సంబరాలు చేసుకోండి. మీ అందరి రాక కోసం నేను ఇక్కడే ఎదురుచూస్తూ ఉంటాను” అని అత్యంత ఆత్మవిశ్వాసంతో, ఉద్వేగభరితంగా దిశానిర్దేశం చేశారు.
**వ్యూహాత్మక అడుగులేనా?**
సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి నియోజకవర్గాల్లో భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం ఆనవాయితీ. కానీ, దానికి భిన్నంగా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పక్కా రాజకీయ వ్యూహం దాగి ఉందన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు గురికాకుండా.. పార్టీ గెలిచిన అభ్యర్థులంతా ఒకేతాటిపై, ఒకే చోట ఉండేలా పకడ్బందీగా ఈ ఆదేశాలు ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తన నాయకత్వం పట్ల, పార్టీ విజయం పట్ల విజయ్ ప్రదర్శిస్తున్న ఈ ధీమా టీవీకే శ్రేణుల్లో మరింత జోష్ నింపుతోంది.







