* ఏఐతో కొలువుల కోత లేదు.. 20 వేల మంది ఫ్రెషర్లకు అవకాశాలు.
* స్పష్టం చేసిన ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్.
* ఉద్యోగుల తొలగింపు ప్రసక్తే లేదని ప్రకటన.
* నైపుణ్యాల పెంపు, కొత్త నియామకాలపైనే దృష్టి.
* ఏఐ టెక్నాలజీపై ఉద్యోగులకు మరింత శిక్షణ.
హైదరాబాద్, మహా.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఐటీ రంగంలో ఉద్యోగాల కోతపై నెలకొన్న ఆందోళనలకు దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తెరదించింది. ఐటీ నిపుణులకు, నిరుద్యోగ యువతకు ఎంతో ఊరటనిస్తూ తీపికబురు చెప్పింది. తమ సంస్థలో ఎలాంటి లేఆఫ్స్ (ఉద్యోగుల తొలగింపులు) చేపట్టబోమని, రానున్న రోజుల్లో కొత్త నియామకాలతో పాటు ఉద్యోగుల నైపుణ్యాల పెంపుపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు.
**ఏఐతో ముప్పు లేదు.. మరింత శిక్షణ**
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తమ ఉద్యోగుల ఉద్యోగాలకు ఎలాంటి కోతలు ఉండబోవని సలీల్ పరేఖ్ కుండబద్దలు కొట్టారు. ఏఐ రాకతో కొలువులు పోతాయన్న ఆందోళన అవసరం లేదన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ సాంకేతికతపై తమ ఉద్యోగులకు మరింత మెరుగైన శిక్షణ అందిస్తామని వెల్లడించారు. నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా కంపెనీని మరింత ప్రతిష్టాత్మకంగా, ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
**20 వేల మంది ఫ్రెషర్ల నియామకం**
కొత్తగా ఐటీ రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కంటున్న యువతకు ఇన్ఫోసిస్ భారీ అవకాశాన్ని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో భారీగా నియామకాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వివిధ దశల్లో కనీసం 20,000 మంది ఫ్రెషర్లను (కొత్తవారిని) నియమించుకోనున్నట్లు సీఈఓ వెల్లడించారు. ఇన్ఫోసిస్ తాజా ప్రకటనతో ఐటీ ఉద్యోగార్థుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి.
**ఖర్చు తగ్గింపులో ఇతర బడా కంపెనీలు..**
ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక సదుపాయాల) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా టెక్ కంపెనీలు ప్రస్తుతం భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా పలు సంస్థలు రీస్ట్రక్చరింగ్ (పునర్వ్యవస్థీకరణ) మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. దీంట్లో భాగంగానే ఖర్చు తగ్గింపు పేరుతో ఉద్యోగుల తొలగింపునకు పాల్పడుతున్నాయి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ ఇన్ఫోసిస్ లేఆఫ్స్ ఉండవని ప్రకటించడం ఐటీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.







