Mahaa Daily Exclusive

  ‘శుభక్షేత్ర’ కేసులో కీలక మలుపు….

Share

* మంగ్లీ సోదరుడి ఖాతాలోకి నగదు మళ్లింపు!
*ఈవోడబ్ల్యూ దర్యాప్తులో వెలుగుచూసిన సంచలన విషయాలు.
* ప్రధాన నిందితుడు మధు ఖాతా నుంచి శివ చౌహాన్‌కు భారీగా నిధుల బదిలీ.
*ఖాతాలో డబ్బు పడిన రోజే విత్ డ్రా.
* విచారణ వేగవంతం చేసిన పోలీసులు.
*తనపై జరుగుతున్నది దుష్ప్రచారమేనని ఖండించిన సింగర్ మంగ్లీ.

హైదరాబాద్, మహా.

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న ‘శుభక్షేత్ర ఇన్ఫ్రా’, మైక్రో ఫైనాన్స్ కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సామాన్యుల కష్టార్జితాన్ని రెట్టింపు చేస్తామంటూ నమ్మించి వందల కోట్ల రూపాయల మేర జరిగిన వసూళ్ల పర్వంలో ప్రముఖ జానపద గాయని మంగ్లీ (సత్యవతి), ఆమె సోదరుడు శివ చౌహాన్‌ల పేర్లు తెరపైకి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ కేసులో సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ), పంజగుట్ట పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఈ కేసు విచారణలో నిందితుల మధ్య జరిగిన భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సంచలన విషయాలు దర్యాప్తు అధికారుల కంటపడటం కేసులో సరికొత్త ట్విస్ట్‌కు దారితీసింది.
**బ్యాంకు ఖాతాల పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు**
శుభక్షేత్ర పేరిట అమాయక ప్రజల నుంచి భారీగా పెట్టుబడులు సేకరించి బోర్డు తిప్పేసిన ఈ కుంభకోణంలో రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి తదితరులను పోలీసులు ప్రధాన నిందితులుగా గుర్తించారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు రమావత్ మధును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఈవోడబ్ల్యూ అధికారులు నిందితుల బ్యాంకు ఖాతాలను లోతుగా విశ్లేషించగా కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. నిందితుడు రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ ఖాతాలోకి మూడుసార్లు భారీగా నగదు బదిలీ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ఆ ఖాతాలో డబ్బులు జమ అయిన వెంటనే అదే రోజున ఆ మొత్తాన్ని ఉపసంహరించినట్లు (విత్‌డ్రా) ఆధారాలు సేకరించారు. దీంతో శివ చౌహాన్‌తో పాటు మంగ్లీ ఆర్థిక లావాదేవీలపైనా పోలీసుల దృష్టి పడింది. ఇప్పటికే మధు బ్యాంకు ఖాతాలను ఈవోడబ్ల్యూ అధికారులు సీజ్ చేయగా, అవసరమైతే మంగ్లీ ఖాతాలను సైతం క్షుణ్ణంగా పరిశీలించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

**అమాయకులకు వల…ఆపై బెదిరింపులు**

ప్రతి నెలా ఐదు శాతం చొప్పున 42 నెలల పాటు కచ్చితమైన రిటర్న్స్ వస్తాయని, సినిమా ఫైనాన్సింగ్ తదితర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నామని నమ్మించి నిందితులు వందలాది మందిని బురిడీ కొట్టించారు. తీరా అసలు, వడ్డీ తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. అయితే, న్యాయం చేయాలని నిలదీసిన బాధితులను, వారి తరఫున వాదిస్తున్న న్యాయవాది సుబ్బారావును మంగ్లీ అనుచరులు తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మోసం, ఆర్థిక నేరాలు, నేరపూరిత బెదిరింపుల కింద భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టంలోని పలు సెక్షన్ల కింద పంజగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. త్వరలోనే ఈ కేసులో మరింత మందిని అదుపులోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

**వందలాది మందికి వల.. రూ.200 కోట్ల స్కామ్!**

ప్రతి నెలా మూడు నుంచి ఐదు శాతం చొప్పున కచ్చితమైన రిటర్న్స్ వస్తాయని, సినిమా ఫైనాన్సింగ్, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నామని నమ్మించి నిందితులు వందలాది మంది మధ్యతరగతి కుటుంబాలను బురిడీ కొట్టించారు. తీరా అసలు, వడ్డీ తిరిగి చెల్లించకపోవడంతో దాదాపు 150 మందికి పైగా బాధితులు న్యాయవాది సింగపోగు సుబ్బారావు ద్వారా పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం అధికారికంగా రూ.10 కోట్ల మేర మోసం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ.. బాధితులు, వారి తరఫు న్యాయవాది మాత్రం ఈ కుంభకోణం విలువ ఏకంగా రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఉంటుందని ఆరోపిస్తున్నారు. పెట్టుబడులు వెనక్కి ఇవ్వాలని నిలదీసిన బాధితులను, వారి న్యాయవాదిని మంగ్లీ, ఆమె సోదరుడు తీవ్రంగా బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

**నాకు ఎలాంటి సంబంధం లేదు.. రివర్స్ కేసు పెట్టిన మంగ్లీ**

తనపై, తన కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలను గాయని మంగ్లీ తీవ్రంగా ఖండించారు. ఈ శుభక్షేత్ర ఇన్ఫ్రా, మైక్రో ఫైనాన్స్ ఆర్థిక మోసాలతో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఆమె బహిరంగంగా ప్రకటించారు. కావాలని ఈ కేసులో తనని, తన తమ్ముడు శివ చౌహాన్‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తన పేరును ఉపయోగించుకుని న్యాయవాది సుబ్బారావు ఉద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మంగ్లీ కౌంటర్ ఫిర్యాదు కూడా దాఖలు చేశారు. అయితే, ఒకవైపు మంగ్లీ ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని బుకాయిస్తున్నప్పటికీ.. ఈవోడబ్ల్యూ పోలీసుల దర్యాప్తులో మాత్రం రమావత్ మధు ఖాతా నుంచి శివ చౌహాన్ ఖాతాలోకి నేరుగా డబ్బులు బదిలీ అయినట్లు సాంకేతిక ఆధారాలు లభించడం ఈ కేసును మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ఈ వ్యవహారంపై పోలీసులు త్వరలోనే మరింత మందిని అరెస్టు చేసే దిశగా పావులు కదుపుతున్నారు.