Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట…

Share

* అస్సాం సీఎం సతీమణి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు.
హైదరాబాద్, మహా.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సతీమణికి బహుళ పాస్‌పోర్టులు ఉన్నాయంటూ చేసిన ఆరోపణల వ్యవహారంలో నమోదైన పరువునష్టం, ఫోర్జరీ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందుర్కర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నమోదైనట్లు ప్రథమదృష్ట్యా అర్థమవుతోందని పేర్కొన్న ధర్మాసనం.. కేవలం రాజకీయ వైరం కారణంతో వ్యక్తిగత స్వేచ్ఛను హరించలేమని స్పష్టం చేసింది.
**కస్టోడియల్ విచారణ అవసరం లేదు**
అస్సాం సీఎం భార్య రినికి భుయాన్ శర్మకు బహుళ పాస్‌పోర్టులు (మూడు దేశాలకు చెందినవి), విదేశాల్లో లెక్కచూపని ఆస్తులు ఉన్నాయంటూ పవన్ ఖేరా ఏప్రిల్ 4న నిర్వహించిన ఒక విలేకరుల సమావేశంలో ఆరోపణలు చేశారు. దీనిపై అస్సాం గౌహతి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఫోర్జరీ, పరువునష్టం తదితర సెక్షన్ల కింద ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పవన్ ఖేరా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన (కస్టోడియల్ ఇంటరాగేషన్) అవసరం ఈ కేసులో కనిపించడం లేదని అభిప్రాయపడింది. ఒకవేళ అరెస్టు చేయాల్సిన పరిస్థితి వస్తే వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలని పోలీసులను ఆదేశిస్తూ ఆయనకు రక్షణ కల్పించింది. అయితే దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని, అవసరమైనప్పుడు విచారణ అధికారుల ఎదుట కచ్చితంగా హాజరుకావాలని పవన్ ఖేరాకు షరతులు విధించింది.
**కోర్టులో వాడివేడిగా ఇరువర్గాల వాదనలు**
పవన్ ఖేరా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఖేరాపై నమోదు చేసిన సెక్షన్లన్నీ బెయిల్ ఇవ్వదగినవేనని, ఈ కేసులో అరెస్టు చేసి ఆయనను కావాలని అవమానించాల్సిన అవసరం లేదని వాదించారు. పారిపోయే ఉద్దేశం ఆయనకు లేదని కోర్టుకు విన్నవించారు. మరోవైపు అస్సాం ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్‌జీ) తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ముఖ్యమంత్రి సతీమణికి సంబంధించినవంటూ ఖేరా నకిలీ, డాక్టరింగ్ చేసిన పాస్‌పోర్టు కాపీలను సృష్టించి ప్రదర్శించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పవన్ ఖేరా దర్యాప్తునకు సహకరించకుండా తప్పించుకుతిరుగుతున్నారని ఆరోపించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ వ్యవహారం రాజకీయ ఉద్దేశాలతో కూడుకున్నదని వ్యాఖ్యానిస్తూ బెయిల్ మంజూరుకే మొగ్గుచూపింది.
**తెలంగాణ హైకోర్టు నుంచి సుప్రీం వరకూ.. సాగిందిలా**
ఈ కేసు నమోదు కాగానే పవన్ ఖేరాను అరెస్టు చేసేందుకు ఏప్రిల్ 7వ తేదీన అస్సాం పోలీసులు ఆయన ఢిల్లీ నివాసానికి వెళ్లారు. దీంతో ఆయన అప్రమత్తమై తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు, ఏప్రిల్ 10న ఆయనకు ఏడు రోజుల పాటు ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిని అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్ 15న స్టే విధించింది. సంబంధిత అధికార పరిధి ఉన్న రాష్ట్ర (అస్సాం) కోర్టులోనే ముందస్తు బెయిల్ కోరాలని సూచించింది. దీంతో ఖేరా గౌహతి హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఏప్రిల్ 24న ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేతకు గురైంది. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో ఆయన తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించి, ఎట్టకేలకు ముందస్తు బెయిల్ రూపంలో భారీ ఊరట పొందారు. ఇన్ని మలుపులు తిరిగిన ఈ కేసులో సుప్రీంకోర్టు తాజా తీర్పు కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది.