Mahaa Daily Exclusive

  78 ఏళ్ల నిరీక్షణకు తెర…

Share

*’ గిరిజన గూడెంలో తొలిసారి ‘విద్యుత్’ వెలుగుల పండుగ.
హైదరాబాద్, మహా.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు గడిచిపోయాయి. సాంకేతికంగా, ఆర్థికంగా దేశం అఖండమైన విజయాలు సాధిస్తూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. కానీ, నాణేనికి మరోవైపున్న వాస్తవం మాత్రం గుండెలను పిండేస్తోంది. అభివృద్ధి ఫలాలు ఇంకా అందని మారుమూల గిరిజన పల్లెలు నేటికీ కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక చిమ్మచీకట్లలోనే మగ్గుతున్నాయి. అయితే, దశాబ్దాల ఆ నిరీక్షణకు తెరదించుతూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ మారుమూల అటవీ గ్రామం ఎట్టకేలకు అంధకారం నుంచి అభ్యుదయం వైపు అడుగులేసింది. తొలిసారిగా ఆ పల్లెలో కరెంటు బల్బులు వెలగడంతో ఆ గిరిజనుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

**చీకటి తెరలు వీడి…కాంతుల పయనం**

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఖైరాగఢ్ జిల్లా సల్హేవారా అటవీ ప్రాంతంలోని గ్వాల్గుండి ఆమాటోలా అనే కుగ్రామం దశాబ్దాలుగా బాహ్య ప్రపంచానికి దాదాపు దూరంగానే ఉంటూ వస్తోంది. ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో బైగా తెగకు చెందిన గిరిజనులు అనేక ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. కనీస రహదారి, రక్షిత తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాలు వారికి ఏనాడూ అందలేదు. సూర్యుడు అస్తమిస్తే చాలు.. ఆ ఊరంతా చిమ్మచీకట్లోకి జారుకునేది. కిరోసిన్ దీపాలు, చలిమంటల వెలుతురులోనే ఇన్ని దశాబ్దాలుగా వారి జీవన చక్రం నడిచింది. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమాటోలా గ్రామంలోకి ఎట్టకేలకు విద్యుత్ తీగలు చేరుకున్నాయి. తొలిసారిగా ఆ ఇళ్లలో విద్యుత్ దీపాలు వెలగడంతో ఊరంతా ఒక పండుగ వాతావరణం నెలకొంది.

**సరిహద్దులు దాటితే వెలుగు..ఇటువైపు అంధకారం**

ఈ గ్రామానికి అత్యంత సమీపంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ఉంది. ఆ సరిహద్దుకు అటువైపు ఉన్న గ్రామాలకు దశాబ్దాల క్రితమే విద్యుత్ కనెక్షన్లు, అభివృద్ధి ఫలాలు అందాయి. కానీ, సరిహద్దుకు ఇటువైపు ఉన్న ఆమాటోలా గ్రామం మాత్రం పాలకుల నిర్లక్ష్యంతో చీకట్లోనే ఉండిపోయింది. పక్కనే ఉన్న గ్రామాల్లో విద్యుత్ దీపాలు జిగేల్‌మంటుంటే.. తమ ఇళ్లలో కరెంటు బల్బు ఎప్పుడు వెలుగుతుందా అని ఈ గిరిజనులు ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. దానికి తోడు ఇది దట్టమైన అటవీ ప్రాంతం కావడం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల కూడలి కావడంతో ఒకప్పుడు ఇక్కడ మావోయిస్టుల ప్రాబల్యం విపరీతంగా ఉండేది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఈ ప్రాంతం నక్సలిజం ఛాయల నుంచి బయటపడుతుండటంతో అభివృద్ధి అడుగులు వేగవంతం అయ్యాయి.

**చిన్నారుల కళ్లలో కొత్త వెలుగులు..ఫ్యాన్ గాలితో ఉపశమనం**

తమ ఇంట్లో తొలిసారిగా విద్యుత్ దీపం వెలగడంతో ఆ గిరిజన పల్లెలోని చిన్నారుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఎలక్ట్రిక్ బల్బుల వెలుతురును చూసి పెద్దలు భావోద్వేగానికి లోనయ్యారు. “ఇప్పటికే మా కుటుంబాల్లో నాలుగు, ఐదు తరాలు చీకట్లోనే గడిచిపోయాయి. ఎట్టకేలకు మా గ్రామానికి విద్యుత్ వచ్చింది. ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంది” అని స్థానికురాలు సోనీ బాయీ కన్నీటి పర్యంతమయ్యారు. “విద్యుత్ రావడంతో మా బతుకులకు చాలా సౌకర్యంగా ఉంది. ఎండాకాలంలో ఎంతో ఇబ్బంది పడేవాళ్లం, ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ తిరుగుతోంది. ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తోంది” అని మురా అనే మరో గ్రామస్థుడు తన సంతోషాన్ని పంచుకున్నాడు.

**నియాద్ నెల్లనార్’తో మారుతున్న ముఖచిత్రం**

సరిగ్గా ఆమాటోలా గ్రామం ఎదుర్కొన్న దుస్థితినే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపుర్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని చిల్కపల్లి అనే మరో మారుమూల గ్రామం కూడా ఎదుర్కొంది. అయితే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘నియాద్ నెల్లనార్ యోజన’ (మీ మంచి గ్రామం) పథకం కింద గత ఏడాది ఆ ఊరికి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. దీంతో ఆ గ్రామం కూడా దశాబ్దాల చీకట్లను పారద్రోలి వెలుగులు చూసింది. ఆమాటోలా, చిల్కపల్లి గ్రామాలకు విద్యుత్ చేరడం ప్రభుత్వ అభివృద్ధి ప్రస్థానంలో ఒక గొప్ప ముందడుగు. అయితే, ఈ దట్టమైన అటవీ పరిసరాల్లో ఇలాంటి కనీస సౌకర్యాలకు నోచుకోని బైగా గిరిజన పల్లెలు ఇంకా అనేకం ఉన్నాయి. స్వాతంత్ర్య ఫలాలు, అభివృద్ధి వెలుగులు అట్టడుగున ఉన్న ప్రతి చివరి ఇంటికీ ఎప్పుడు చేరుతాయన్నదే ఇప్పుడు పాలకుల ముందున్న ప్రధాన సవాలు. అయినప్పటికీ, ఆమాటోలా గ్రామంలో విరబూసిన ఈ విద్యుత్ వెలుగులు.. చీకటి బతుకులు వెళ్లదీస్తున్న చుట్టుపక్కల ఎన్నో పల్లెలకు ఇప్పుడు సరికొత్త ఆశాకిరణంగా మారాయి.