Mahaa Daily Exclusive

  హ్యామ్ రోడ్ల టెండర్లలో ‘ఎక్సెస్’ కుంభకోణం….

Share

* ఖజానాకు ₹5 వేల కోట్ల గండి!
*నాడు ధనయజ్ఞమన్నారు.. నేడు చేస్తున్నదేమిటి?
*ఒకే కంపెనీకి 15 టెండర్లు.. రిటైర్డ్ అధికారులకు పొడిగింపులు.
* హ్యామ్ అక్రమాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజం.

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రహదారుల టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వం అడ్డగోలు అవినీతికి తెరలేపిందని, నిబంధనలకు విరుద్ధంగా ‘ఎక్సెస్’ ధరలకు టెండర్లు కట్టబెడుతూ ప్రజల సొమ్మును కొల్లగొడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తాము ఆధారాలతో సహా హెచ్చరించిన విషయాలు నేడు అక్షర సత్యాలయ్యాయని మండిపడ్డారు. ముఖ్యంగా రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ)తో పాటు పంచాయతీ రాజ్ విభాగాల్లో సుమారు 25 టెండర్లను తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు 25 శాతం వరకు ఎక్సెస్ ధరలతో టెండర్లు ఖరారు చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంచనా వ్యయాలకు, ప్రస్తుత టెండర్ ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని హరీష్ రావు గణాంకాలతో సహా ఎండగట్టారు. ఆర్ అండ్ బీ శాఖలో రూ. 11 వేల కోట్లకు టెండర్లు పిలిస్తే, ఎక్సెస్ ధరల వల్ల అది రూ. 15 వేల కోట్లకు చేరిందని, అలాగే పంచాయతీ రాజ్‌లో రూ. 6 వేల కోట్ల అంచనా కాస్తా రూ. 8 వేల కోట్ల వరకు వెళ్లిందని వివరించారు. ఈ అడ్డగోలు పెంపు వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ. 5 వేల కోట్ల భారం పడుతోందని, ఇది ముమ్మాటికీ ప్రజాధనాన్ని దోచిపెట్టడమేనని విమర్శించారు. హ్యామ్ మోడల్ పేరిట చేపడుతున్న ఈ రోడ్ల కోసం 60 శాతం నిధులను బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకువచ్చి, ఆ అప్పును వడ్డీతో సహా 15 ఏళ్ల పాటు 30 వాయిదాల్లో తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల రాబోయే ప్రభుత్వాలపై, ప్రజలపై తీరని ఆర్థిక భారం పడుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా చేస్తున్న అప్పులతో పాటు ఇలాంటి పరోక్ష అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పాత పద్ధతులకు స్వస్తి పలుకుతామని చెప్పి, మళ్లీ ‘మొబిలైజేషన్ అడ్వాన్సుల’ దందాను తెరపైకి తెచ్చిందని హరీష్ రావు ఆరోపించారు. గతంలో ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు సమయంలో ఇదే మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని చూసి ‘జలయజ్ఞం కాదు ధనయజ్ఞం’ అని విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి, నేడు అదే విధానంతో 10 శాతం అడ్వాన్సులు ఇచ్చేందుకు సిద్ధపడటం ఆయన అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఈ అడ్వాన్సుల విధానాన్ని రద్దు చేశామని, టెండర్లలో 5 శాతం కంటే ఎక్కువ ఎక్సెస్ ఉంటే వెంటనే రీ-కాల్ చేసే పారదర్శకతను పాటించామని గుర్తు చేశారు. కానీ నేడు 25 శాతం ఎక్సెస్ ఉన్నా పట్టించుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, కేవలం ఒకే కంపెనీకి ఏకంగా 15 టెండర్లు దక్కబోతున్నాయని, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను త్వరలోనే బయటపెడతానని స్పష్టం చేశారు.
ఈ అవినీతి పర్వాన్ని సాఫీగా సాగించేందుకే ప్రభుత్వం తమకు అనుకూలమైన అధికారులను కీలక పోస్టుల్లో కొనసాగిస్తోందని హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ అండ్ బీలో రిటైర్ అయిన చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, పంచాయతీ రాజ్‌లో చీఫ్ ఇంజనీర్ జోగారెడ్డిల పదవీ కాలాన్ని పొడిగించి మరీ ఈ టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు అడ్వైజర్లు ఉండరని, ఎక్స్‌టెన్షన్లు ఉండవని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు తన మాటలను గాలికొదిలేసి కీలక శాఖల్లో రిటైర్డ్ అధికారులను ఎందుకు కొనసాగిస్తున్నారని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఇవాళ అధికారంలో ఉంటారు, రేపు పోతారు.. కానీ ఆయన చేసే ఈ ఎక్సెస్ టెండర్ల పాపం రాష్ట్ర ఖజానాకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందని ధ్వజమెత్తారు. వెంటనే ఈ ఎక్సెస్ టెండర్లను రద్దు చేసి, అన్నింటినీ రీ-కాల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.