- మద్యం తాగి వచ్చిన సీఎం అంటూ ప్రతిపక్షాల ఆందోళన
- అట్టుడికిన పంజాబ్ అసెంబ్లీ
- లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్
- తిరస్కరించిన స్పీకర్
ఛండీఘడ్. మహా : పంజాబ్ అసెంబ్లీలో శుక్రవారం ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం మత్తులో సభకు వచ్చారంటూ విపక్ష కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఆరోపించడమే కాకుండా, ఆయనకు తక్షణమే బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేయడంతో సభ అట్టుడికిపోయింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రవర్తనపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. సీఎం మద్యం సేవించి సభకు వచ్చారని, ఆయనకు తక్షణమే ఆల్కహాల్ టెస్ట్ చేయాలని ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం మొదలైంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, ఆప్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లి పరస్పర నినాదాలతో హోరెత్తించడంతో స్పీకర్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
అది ప్రజాస్వామ్య దేవాలయానికి అవమానం
ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా స్పీకర్‌కు రాసిన లేఖలో ముఖ్యమంత్రి ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరంగా ఉందని పేర్కొన్నారు. సభలో ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా లేవనెత్తిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండానే ముఖ్యమంత్రి బయటకు వెళ్లిపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ముఖ్యమంత్రితో సహా సభలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ డోప్ టెస్ట్, బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించాలి. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇలాంటి ప్రవర్తనను అనుమతిస్తే ప్రజల్లో సభపై ఉన్న గౌరవం పోతుంది అని బాజ్వా హెచ్చరించారు.
ఫ్లోర్ టెస్ట్ కంటే బ్రీత్ అనలైజర్ టెస్ట్ ముఖ్యం
పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ కూడా విపక్షాల డిమాండ్‌కు మద్దతు పలికారు. గురుద్వారాలు లేదా దేవాలయాల్లోకి ఎవరైనా మద్యం సేవించి వెళ్తే అది ఎంత పెద్ద అపరాధమో, అసెంబ్లీలోకి మద్యం మత్తులో రావడం కూడా అంతే పెద్ద నేరం. ఈరోజు ప్రభుత్వం ఫ్లోర్ టెస్ట్ చేయడం కంటే, సభ్యులందరికీ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయడం ముఖ్యం. అది చేస్తే అసలు ఫ్లోర్ టెస్ట్ అవసరమే ఉండదు అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ నేతలు ఆరోపించారు.
ఆరోపణలను కొట్టిపారేసిన ఆప్
విపక్షాల ఆరోపణలపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇవన్నీ నిరాధారమైన, హాస్యాస్పదమైన ఆరోపణలని పంజాబ్ ఆప్ అధ్యక్షుడు, మంత్రి అమన్ అరోరా మండిపడ్డారు. సభలో చర్చను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆప్ నేతలు పేర్కొన్నారు. విపక్షాల ఆందోళనల మధ్యే మాన్ ప్రభుత్వం సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కాగా, డోప్ , బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలన్న విపక్షాల విజ్ఞప్తిని స్పీకర్ తోసిపుచ్చారు.






