- పుదుచ్చేరిలో ఎన్డీఏదే అధికారం
- వరుసగా రెండోసారి విజయాన్ని సాధించిన ఎన్డీఏ కూటమి
- కలిసొచ్చిన రంగసామి నాయకత్వం, సంక్షేమ పథకాలు
- రెండో స్థానానికే పరిమితమైన ఇండీ కూటమి
న్యూడిల్లీ, మహా : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిని ఎన్డీఏ కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లుగానే ఎన్డీఏ కూటమిలోని ఆల్ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సీ) విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దక్కించుకుంది. వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెస్, డీఎంకే అలయన్స రెండో స్థానానికే పరిమితమైంది.సీఎం రంగసామికి ఉన్నప్రజాదరణ, సంక్షేమ కార్యక్రమాలపై ఆశలు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన ఎన్డీఏకు ఈ అంశాలు బాగా కలిసి వచ్చాయి. ప్రజలు కూడా ఎన్డీఏ కూటమికే మొగ్గు చూపారు. ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటం బీజేపీ కూటమికి ప్లస్ పాయింట్‌గా మారాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్ని కూటమి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని నమ్మించగలిగింది. దీనికి తోడు ఎన్డీఏలో ఉన్న ఏఐఎన్‌ఆర్‌సీ, బీజేపీ అన్నాడీఎంకే, ఎల్జేకే పార్టీలు మధ్య ఎలాంటి విబేధాలు లేకుండా సమన్వయంతో సీట్ల పంపిణీ జరిగింది. కూటమి ఐక్యత ఎన్డీఏ విజయాన్ని మరింత సులువైంది. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రకటించిన హామీలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. నీటి ఏటీఎంలు, అటల్ క్యాంటీన్లు, మహిళలకు 2 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, బాలికలకు ఈ-స్కూటర్లు, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు వంటి హామీలను ప్రకటించింది. అలాగే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం పొందని గృహిణులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ. 1000 నుంచి రూ.2,500కు పెంచుతామని తెలిపింది. అలాగే మత్య్సకారుల చిరకాల డిమాండ్‌కు అనుగుణంగా చర్యలు తీసుకుని వెనుకబడిన జాబితాలో చేరుస్తామని ప్రకటించడం ఓటర్లను ఆకర్షించాయి.
విజయంలో రంగసామి కీలకం
ఎన్డీఏ విజయానికి కేవలం కూటమి, సంక్షేమ పథకాలే కాదు. సీఎం రంగస్వామి నాయకత్వం కూడా కీలక పాత్ర పోషించింది. రంగసామికి ఉన్న క్లీన్ ఇమేజ్ ఎన్డీఏ గెలుపును మరింత సులభతరం చేసింది. అంతేకాకుండా ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణ కూడా ఎక్కువే. హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ సాధారణంగా జీవిస్తుంటారు. ఆయన అవివాహితుడు. ఆయనది సింపుల్ లైఫ్‌స్టైల్. తురచూ బైక్‌పై ప్రయణిస్తుంటారు. విద్యార్థులకు ఉదయం పూట రొట్టె, పాలు అందించే పథకం, సీనియర్ల సిటిజన్లకు పింఛన్ పెంపు, రైతులకు పథకాలు, విపత్తు సమయంలో సహాయం అందించడంతో జనంలో పేరొందారు. గ్రామీణ ఓటర్లతో ఆయనకు బలమైన బంధం కూడా ఉంది. 1990లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రంగసామి మంత్రిగా, అత్యధికంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఈ విజయంతో ఐదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. పలుమార్లు కీలక పదవులు చేపట్టడం, ప్రజల్లో ఉన్న ఇమేజ్ కారణంగా ఎన్డీఏ సర్కార్ విజయం సాధించింది. ఎన్నికల సమయంలో నిర్వహించిన సర్వేలో కూడా 62-68శాతం మంది ఓటర్లు రంగసామి సీఎంగా ఉండాలని కోరుకోవడం గమనార్హం.
కాంగ్రెస్-డీఎంకే అలయన్స్ బలహీనత
ఇక కాంగ్రెస్- డీఎంకే అలయన్స్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. మరోసారి రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇండియా కూటమిలోని విభేదాలు అలయన్స్‌కు ప్రతికూలంగా మారాయి. ఆ ప్రతికూలతలు ఎన్డీఏ అనుకూలంగా మారినట్లు స్పష్టమవుతోంది. ఎన్డీఏ కూటమికి రంగసామి లాంటి బలమైన నేత సారధిగా ఉన్నారు. కానీ ఇండియా కూటమికిి ఆ స్థాాయిలో నాయకుడు లేకపోవడం అలయన్స్‌ను దెబ్బతీసింది. ఇన్నాళ్లు పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్న వి.నారాయణస్వామి ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి. అలాగే అంతర్గత విభేదాలు కూడా ఓటమికి కారణమయ్యాయి. ఈ ఎన్నికల్లో విజయ్‌కు చెందిన టీవీకే పోటీ చేయడం కూడా ఇండియా కూటమికి ప్రతికూలం అంశంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును టీవీకే చీల్చడం కాంగ్రెస్ కూటమి ఓటు బ్యాంకుకు గండిపడినట్లు తెలుస్తోంది. తద్వారా పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయం నల్లేరుమీద నడక అయ్యింది.








