**పుదుచ్చేరిలో ‘రంగసామి’ మ్యాజిక్.
**వరుసగా రెండోసారి ఎన్డీఏదే అధికారం!**
పుదుచ్చేరి,మహా.
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) విజయదుందుభి మోగించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ అధికార పీఠాన్ని వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో మ్యాజిక్ ఫిగర్‌ను సొంతం చేసుకుని సత్తా చాటింది. రాష్ట్ర హోదా, పూర్తిస్థాయి అధికారాలు లేవనే ప్రతికూలతలను సైతం అధిగమించి ఎన్డీఏ కూటమిలోని ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సీ) ఈ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, డీఎంకే (ఇండియా కూటమి) మరోసారి రెండో స్థానానికే పరిమితం కాగా.. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపునకు దారితీసిన ప్రధాన అంశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
**అండగా నిలిచిన ‘డబుల్ ఇంజిన్’ నినాదం**
ముఖ్యమంత్రి రంగసామికి ఉన్న అపారమైన ప్రజాదరణ, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే ఎన్డీఏను తిరిగి అధికారంలోకి తెచ్చాయి. ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీఏ పదిలంగా ఉండటం ఈ కూటమికి ప్రధాన బలాన్నిచ్చింది. ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ నినాదాన్ని కూటమి నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. దీనికి తోడు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న ఏఐఎన్‌ఆర్‌సీ, బీజేపీ, అన్నాడీఎంకే, ఎల్జేకే పార్టీల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా సీట్ల సర్దుబాటు సజావుగా సాగింది. నాయకుల మధ్య ఉన్న ఈ ఐక్యతే ఎన్డీఏ విజయతీరాలను మరింత సులభతరం చేసింది.
**ఓటర్లను ఆకర్షించిన జనరంజక హామీలు**
ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రకటించిన ప్రణాళికలు, హామీలు ఓటర్ల మదిని దోచుకున్నాయి. తాగునీటి కోసం వాటర్ ఏటీఎంలు, అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న వాగ్దానం సామాన్యులను ఆకట్టుకుంది. మహిళలకు ఏటా రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ఈ-స్కూటర్లు, స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీలు ఓట్ల వర్షం కురిపించాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం పొందని గృహిణులకు ప్రస్తుతం ఇస్తున్న వెయ్యి రూపాయల సాయాన్ని రెండున్నర వేలకు పెంచుతామని ప్రకటించడం మహిళా ఓటర్లను విశేషంగా ఆకర్షించింది. అలాగే, మత్స్యకారుల చిరకాల డిమాండ్‌ను నెరవేరుస్తూ వారిని వెనుకబడిన తరగతుల జాబితాలో చేరుస్తామని భరోసా ఇవ్వడం ఎన్డీఏకు బాగా కలిసొచ్చింది.
**విజయంలో ‘రంగసామి’ ఇమేజ్ కీలకం**
ఈ చారిత్రక విజయంలో కూటమి, సంక్షేమ పథకాల పాత్ర ఎంత ఉందో ముఖ్యమంత్రి రంగసామి నాయకత్వ పటిమ కూడా అంతే ఉంది. ఆయనకున్న ‘క్లీన్ ఇమేజ్’, సాధారణ జీవనశైలి ఆయనను ప్రజలకు మరింత చేరువ చేశాయి. ఆర్భాటాలకు పోకుండా సామాన్యుడిలా ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఆయన శైలికి పుదుచ్చేరి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విద్యార్థులకు ఉదయం పూట పాలు, రొట్టె అందించే పథకం, సీనియర్ సిటిజన్లకు పింఛన్ల పెంపు, అన్నదాతలకు అండగా నిలిచే పథకాల అమలుతో ఆయన గ్రామీణ ఓటర్ల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. 1990లో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన అత్యధికంగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజా విజయంతో ఐదోసారి సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు. ముందస్తు సర్వేల్లో ఏకంగా 68 శాతం మంది ప్రజలు రంగసామిే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం ఆయనకున్న ఆదరణకు ప్రబల నిదర్శనం.
**కాంగ్రెస్-డీఎంకే కూటమిని దెబ్బతీసిన లోపాలు**
మరోవైపు ఇండియా కూటమిగా బరిలోకి దిగిన కాంగ్రెస్, డీఎంకేలకు తీరని నిరాశే ఎదురైంది. ఆ కూటమిలోని అంతర్గత విభేదాలు ప్రతికూల ఫలితాలకు దారితీశాయి. ఎన్డీఏకు రంగసామి లాంటి బలమైన, ఆకర్షణీయమైన నాయకుడు ఉండగా.. ఇండియా కూటమికి ఆ స్థాయిలో ప్రజలను ప్రభావితం చేసే నేత కరువయ్యారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటం ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా మారింది. దీనికి తోడు, ప్రముఖ నటుడు విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ ఈ ఎన్నికల్లో బరిలోకి దిగడం ఎన్డీఏకు పరోక్షంగా లాభించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను టీవీకే చీల్చడంతో కాంగ్రెస్ కూటమి ఓటు బ్యాంకుకు భారీ గండి పడింది. ఫలితంగా పుదుచ్చేరి పీఠం మరోసారి ఎన్డీఏ వశమైంది.








