Mahaa Daily Exclusive

  బెంగాల్‌కు విముక్తి.. తెలంగాణలోనూ కాషాయ జెండా ఖాయం!

Share

*బెంగాల్‌కు విముక్తి.. తెలంగాణలోనూ కాషాయ జెండా ఖాయం!
*మే 10న ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి: డాక్టర్ కే. లక్ష్మణ్
*శ్యామాప్రసాద్ ముఖర్జీ కల సాకారమైందన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి
*రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అంబరాన్నంటిన బీజేపీ సంబరాలు
హైదరాబాద్, మహా.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ కూటమి ఘనవిజయం సాధించడం పట్ల తెలంగాణ రాష్ట్ర బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. సోమవారం నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉత్సాహభరిత వాతావరణంలో భారీగా సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు నాయకత్వంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందం పంచుకున్నారు. ఈ వేడుకల్లో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
అనంతరం డాక్టర్ కే. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్‌తో పాటు మూడు రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అఖండ విజయం సాధించడం దేశ ప్రజాస్వామ్యానికే గొప్ప శుభపరిణామం అని అభివర్ణించారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సాగించిన అరాచక, అవినీతి పాలనకు, చొరబాటుదారుల ప్రోత్సాహానికి అక్కడి ప్రజలు చరమగీతం పాడారని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం కోల్‌కతా నుంచి కొందరు మిత్రులు ఫోన్ చేసి ‘మాకు విముక్తి లభించింది’ అని చెప్పడం అక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు. అభివృద్ధి, పారదర్శక పాలన అందించిన ప్రభుత్వాలకే అసోం, పుదుచ్చేరి ప్రజలు ప్రో-ఇన్‌కంబెన్సీ ఓటు వేశారని, అదే సమయంలో తమిళనాడు, బెంగాల్‌లో అవినీతి, బంధుప్రీతిని సాగదీస్తూ డబ్బు రాజకీయాలు చేసిన వారిని నిర్మొహమాటంగా తిరస్కరించారని ఆయన విశ్లేషించారు. దేశవ్యాప్తంగా మోదీ సర్కార్ అమలు చేస్తున్న ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదానికి ఇది దక్కిన అద్భుత విజయమన్నారు. ప్రజల తీర్పును అంగీకరించకుండా ఈవీఎంల మీద నెపాలు వేస్తూ, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న స్టాలిన్ లాంటి నేతలకు భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని లక్ష్మణ్ తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు గత పదేళ్లలో రాష్ట్ర సంపదను దోచుకున్నాయని, ఒకప్పుడు రాష్ట్రంలోని ఒక కుటుంబం దోచుకుంటే ఇప్పుడు ఢిల్లీలోని కుటుంబానికి సంపద మళ్లుతోందన్న భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు స్పష్టమైన మార్పు కోసం బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. గత పన్నెండేళ్లలో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సుమారు రూ. 15 లక్షల కోట్లు కేటాయించిందని, రైల్వేలు, జాతీయ రహదారులు, ఎయిమ్స్, గిరిజన విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకువచ్చిందని గుర్తుచేశారు. మే 10న మోదీ పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రావడం ఖాయమని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే మోదీకి మనం ఇచ్చే గొప్ప కానుక అని లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్మించిన పశ్చిమ బెంగాల్‌లో ఆయన కలలుగన్న దిశగా మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారం సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. ఆ మహానేత ఆత్మకు శాంతి చేకూర్చే ఘట్టం ఇదేనన్నారు. 2011లో ఒక్క సీటు కూడా లేని స్థాయి నుంచి నేడు మూడింట రెండొంతుల (టూ-థర్డ్) మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదగడం ప్రధానిపై బెంగాల్ ప్రజలు ఉంచిన అపార విశ్వాసానికి నిదర్శనమన్నారు. చొరబాటుదారులు, పేదరికం లాంటి ప్రధాన సమస్యలను బీజేపీ మాత్రమే పరిష్కరించగలదని అక్కడి ప్రజలు నమ్మారని తెలిపారు. అసోంలో సైతం వరుసగా మూడోసారి భారీ మెజారిటీతో గెలవడం సామాన్య విషయం కాదన్నారు. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా నుంచి బెంగాల్, ఒడిశా వరకు బీజేపీ ప్రభంజనం విస్తరిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని, రాంచందర్ రావు నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమని మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.