కెసిఆర్ ని అరెస్ట్ చేసే దమ్ము లేదు మీకు.
* మోదీ సభను డైవర్ట్ చేసేందుకే ‘సీబీఐ’ డ్రామాలు.
* రైతు పేరుతో రాజకీయం చేస్తున్నారు.
* రేవంత్ రెడ్డి వైఫల్యాల పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్.
కరీంనగర్, మహా.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై విచారణ కమిషన్ నివేదిక ఇచ్చి ఏడాదిన్నర దాటినా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌తో ఇన్నాళ్లూ బేరసారాలు ఆడారని, ఆ బేరాలు కుదరకపోవడం వల్లే ఇప్పుడు కేంద్రానికి లేఖల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేసే సాహసం చేయలేక, తమ భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి తీరును ఎద్దేవా చేశారు.
మంగళవారం కరీంనగర్ జిల్లా ఖాజీపూర్ వడ్ల కొనుగోలు కేంద్రం వేదికగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మండుటెండలో వడ్ల కుప్పల వద్ద రైతులు పడుతున్న అరిగోసను ఆయన స్వయంగా పర్యవేక్షించి, వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. 15 రోజులు దాటినా వడ్లు కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు లేకపోవడాన్ని చూసి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతు చస్తుంటే పట్టింపులేని ఈ ప్రభుత్వం, కేవలం రాజకీయ నాటకాలకే ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు. క్షేత్రస్థాయిలో రైతుల వెతలు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
**మోదీ సభను డైవర్ట్ చేసేందుకే ‘సీబీఐ’ డ్రామాలు**
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన చారిత్రక విజయంతో పాటు, ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభపై జరుగుతున్న చర్చను దారి మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త నాటకాలకు తెరతీశారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలోని వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ‘సీబీఐ విచారణ’ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈపాటికే చర్యలు ఉండేవని, కానీ కేవలం కేంద్రంపై నెపం నెట్టేందుకే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన విశ్లేషించారు.
**వడ్ల కొనుగోళ్లలో వైఫల్యం.. గణాంకాలతో బట్టబయలు**
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని బండి సంజయ్ గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 15 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రతి గింజకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంటే, కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేమిటని ప్రశ్నించారు. కొన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ కూడా లభిస్తున్నా, రైతులను గాలికి వదిలేసి మంత్రులు సంబరాలు చేసుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
**తాలు, తరుగు పేరిట రైతు రక్తం తాగుతున్న దళారులు**
కొనుగోలు కేంద్రాల్లో దళారుల రాజ్యం నడుస్తోందని, తాలు, తరుగు మరియు తేమ పేరుతో క్వింటాకు నాలుగైదు కిలోల చొప్పున కోత విధిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ దోపిడీ వల్ల ఒక్కో రైతు సగటున రూ. 20 వేలకు పైగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు టోకెన్లు ఇచ్చేందుకు కూడా దళారులు కమీషన్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. అడ్డగోలుగా కటింగ్ చేస్తూ రైతుల కష్టాన్ని దళారుల పాలు చేస్తున్న ఈ సర్కార్‌పై రైతులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఆయన హెచ్చరించారు.
**నిధుల వినియోగంలో నిర్లక్ష్యం.. ల్యాప్స్ అయిన రూ. 205 కోట్లు**
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వ్యవసాయ రంగంలోనే కాకుండా విద్యా రంగంలోనూ ఘోరంగా విఫలమైందని బండి సంజయ్ విమర్శించారు. ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 205 కోట్ల నిధులు మంజూరు చేసినా, వాటిని వాడుకోలేని అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ నిధులు ల్యాప్స్ అయ్యాయని, ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు విద్యార్థులకు కనీసం ఫీజులు కూడా చెల్లించలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని విమర్శించారు.
**కేంద్రం వైఖరి స్పష్టం.. చేతగానితనాన్ని ఒప్పుకోండి**
తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెపం నెట్టడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేయడం తమవల్ల కాదని, తమకు ఆ దమ్ము లేదని ముఖ్యమంత్రి బహిరంగంగా ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. “రేవంత్ రెడ్డి గారూ… మీకు చేతగాదని లేఖలో రాసి పంపండి, అప్పుడు కేంద్రం చూసుకుంటుంది” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణ కోరుతూ డ్రామాలు చేయడం మానేసి, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులను సక్రమంగా నిర్వహించాలని హితవు పలికారు.
**యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు చేపట్టాలి**
రైతులు వడదెబ్బకు తాళలేక కొనుగోలు కేంద్రాల్లోనే ప్రాణాలు వదులుతున్నా రేవంత్ సర్కార్‌లో చలనం లేకపోవడం దారుణమని బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే మొద్దునిద్ర వీడి యుద్ధ ప్రాతిపదికన వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తాలు, తరుగు పేరుతో కటింగ్ లేకుండా మద్దతు ధర చెల్లించి ప్రతి గింజను కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై తక్షణమే స్పందించకుంటే మంత్రులను రైతులు ఊళ్లలో తిరగనివ్వరని, ప్రతిపక్షంగా బీజేపీ రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని ఆయన ప్రకటించారు.








