కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు!
* సిబీఐ మోడీ జేబు సంస్థ అయితే.. విచారణ ఎలా కోరుతారు?
* పాలన చేతగాకనే దారి మళ్లింపు రాజకీయాలు.
* కరెంటు లేక రైతులు అల్లాడుతుంటే.. విచారణల పేరుతో డ్రామాలా?
* కాంగ్రెస్ అరాచక పాలనపై మాజీ మంత్రి నిప్పులు
* మోడీ కాళ్ళ మీద పడ్డ రేవంత్ రెడ్డి.. తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదా?
* మాజీమంత్రి జగదీష్ రెడ్డి ఫైర్.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అజ్ఞానులు, మూర్ఖుల చేతిలో చిక్కుకుందని, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాలన ఎలా చేయాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ హయాంలో కేబినెట్ సమావేశం జరుగుతుందంటే ప్రజలు తమకు ఎలాంటి మేలు జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురుచూసే వారని, కానీ నేటి ప్రభుత్వానికి ప్రజల గురించి ఆలోచించే తీరికే లేదని మండిపడ్డారు. కేవలం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడంపైనే ఈ ప్రభుత్వం తన శక్తియుక్తులన్నీ ధారపోస్తోందని విమర్శించారు.
గత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సిబీఐ విచారణకు కేబినెట్ తీర్మానించడం ఒక పనికిమాలిన నిర్ణయమని జగదీష్ రెడ్డి కొట్టిపారేశారు. “రాహుల్ గాంధీ నిత్యం సిబీఐని మోడీ జేబు సంస్థ అని విమర్శిస్తుంటారు. మరి అదే సిబీఐకి విచారణ ఎలా అప్పగిస్తారు?” అని ఆయన నిలదీశారు. ఇది రేవంత్ రెడ్డి వెళ్లి మోడీ కాళ్ళ మీద పడటం తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు. సొంత పార్టీ విధానానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును చూసి రాహుల్ గాంధీ సిగ్గుపడాలని, అసలు కాంగ్రెస్ పార్టీని రేవంత్ ఏం చేస్తున్నారో అధిష్టానం ఆలోచించుకోవాలని హితవు పలికారు. సిబీఐపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తప్పని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా అని ప్రశ్నించారు.
కేసీఆర్ కడిగిన ముత్యం లాంటి నాయకుడని, ఆయన ఎఫ్‌బీఐ , కేజీబీ లేదా సిబీఐ వంటి ఏ సంస్థ విచారణకైనా భయపడరని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్ స్వచ్ఛంగా బయటకు వచ్చారని, ఇప్పుడు విద్యుత్ విచారణలోనూ అదే పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అందించిన అద్భుతమైన పాలనను ఓర్వలేకనే ఇలాంటి విచారణలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, కానీ అంతిమంగా నిజమే గెలుస్తుందని పేర్కొన్నారు. ఈ విచారణల వల్ల ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే ఇవి మిగిలిపోతాయని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలోపే కరెంటు కష్టాలను చక్కదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో 24 గంటల పాటు నిరంతరాయంగా ఇచ్చిన విద్యుత్తును.. ఇప్పుడు కనీసం రైతులకు 12 గంటలు కూడా ఇవ్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. గ్రామాల్లో, హైదరాబాద్ నగరంలో కరెంటు కోతలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే పాత ఒప్పందాలపై విచారణల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. కరెంటు సరఫరాపై ఏ మంత్రయినా తనతో చర్చకు రావాలని, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నిరూపిస్తానని ఆయన బహిరంగ సవాల్ విసిరారు.
విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ ఎప్పుడు విచారణ జరిపింది, ఆ రిపోర్టులో ఏముందో ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. విచారణ పూర్తయి కమిషన్ నివేదిక ఇస్తే, దానిని అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టలేదని నిలదీశారు. “మదన్ లోకూర్ ఈ ప్రభుత్వాన్ని తిట్టి వెళ్లారని మా దగ్గర సమాచారం ఉంది” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం రిపోర్టుకు ముందు ఈ రిపోర్ట్ వచ్చిందా లేక తర్వాత వచ్చిందా అనే విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే ప్రభుత్వం నివేదికను దాచిపెడుతోందని ఆరోపించారు.
రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు నిధులు ఇవ్వడంలో, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఎగ్గొట్టేందుకే వడ్ల కొనుగోలులో జాప్యం చేస్తున్నారని, ఈ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్‌పై విచారణల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. “భగీరథ బతికుంటే ఈ ప్రభుత్వ తీరు చూసి ఆత్మహత్య చేసుకునే వారు” అని వ్యాఖ్యానిస్తూ.. తాగునీరు, సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని అంతర్గత విషయాలపై విచారణ జరిపించడానికి తెలంగాణ పోలీసులపై ప్రభుత్వానికి నమ్మకం లేదా అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. “తెలంగాణ పోలీసులు చేతకాని వాళ్లా? లేక వారిపై మీకు విశ్వాసం లేదా?” అని ముఖ్యమంత్రిని నిలదీశారు. చిన్న విషయాలకు కూడా సిబీఐ అంటూ ఢిల్లీ వైపు చూడటం రేవంత్ రెడ్డి బానిస మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అవమానిస్తూ, కేంద్ర సంస్థల చుట్టూ తిరగడం వెనుక ఉన్న మర్మమేంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకమని ఆయన విశ్లేషించారు.
సగటు కాంగ్రెస్ కార్యకర్త ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నడుస్తున్నది రాహుల్ గాంధీ డైరెక్షన్‌లో ఉన్న ప్రభుత్వమా లేక మోదీ నడుపుతున్న ప్రభుత్వమా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. సిబీఐపై రాహుల్ గాంధీ చేసిన ఘాటైన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకే గొడ్డలి పెట్టు అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిబీఐ విచారణలు కోరుతూ వేస్తున్న అడుగులపై ఆ పార్టీయే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ నేతలు ఓ. నరసింహ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








