Mahaa Daily Exclusive

  మార్కెట్లకు వసంతం..,

Share

మార్కెట్లకు వసంతం..
* భారీ లాభాలతో దూసుకుపోతున్న సెన్సెక్స్, నిఫ్టీ.
* ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన ట్రంప్.
* శాంతించిన క్రూడాయిల్ ధరలు.
* ఒకే రోజు 600 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.
హైదరాబాద్, మహా.
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తెరదించుతూ జరుగుతున్న శాంతి చర్చలు భారత స్టాక్ మార్కెట్లకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చాయి. అంతర్జాతీయ ప్రతికూలతలతో ఇన్నాళ్లూ కుదేలైన సూచీలు ఒక్కసారిగా బుల్‌రన్ దిశగా పరుగులు తీశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలతో మదుపర్ల సెంటిమెంట్ అనూహ్యంగా బలపడింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉదయం నుంచే కొనుగోళ్ల పండుగ నెలకొనగా, సెన్సెక్స్ ఏకంగా 600 పాయింట్లు ఎగబాకింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం భారీ లాభాలతో దూసుకెళ్లి సరికొత్త మైలురాయిని అధిగమించింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 104.30 పాయింట్ల (0.43%) లాభంతో 24,137 స్థాయికి చేరింది. గత సెషన్‌లో అమ్మకాల ఒత్తిడితో నష్టపోయిన ఆటో, రియల్టీ, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు తక్కువ ధరల వద్ద భారీగా కొనుగోళ్లు చేపట్టడం మార్కెట్ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. విస్తృత మార్కెట్‌లో చూస్తే నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం ఒక శాతానికి పైగా లాభాలను మూటగట్టుకున్నాయి.
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల వాతావరణంలో సాగుతుండటం ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లకు ఊరటనిచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలకమైన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం మార్కెట్లకు అత్యంత బలాన్నిచ్చింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదురుతుందన్న బలమైన అంచనాల మధ్యే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దశాబ్దాలుగా నెలకొన్న వైరం సద్దుమణుగుతుందన్న ఆశలతో గ్లోబల్ ఇన్వెస్టర్లు అప్రమత్తత వీడి తిరిగి ఈక్విటీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇది నేరుగా భారత మార్కెట్లలోకి విదేశీ నిధుల రాకను పెంచడానికి దోహదం చేస్తోంది.
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు ధరల్లో సైతం భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ఇన్నాళ్లూ భగ్గుమన్న క్రూడాయిల్ ధరలు, తాజా శాంతి చర్చల వార్తలతో ఒక్కసారిగా దిగివచ్చాయి. ఇరాన్‌తో నెలకొన్న ప్రతిష్టంభన వీడితే చమురు సరఫరా మెరుగుపడుతుందన్న వార్తలతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 1.55 శాతం క్షీణించి 108.2 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడిన భారత ఆర్థిక వ్యవస్థకు ఇది భారీ ఊరటనిచ్చే అంశంగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇక కరెన్సీ మార్కెట్లోనూ సానుకూల పవనాలు వీస్తున్నాయి. మునుపటి సెషన్‌లో నష్టాలతో ముగిసిన రూపాయి విలువ, తాజా పరిణామాలతో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 0.26 శాతం పుంజుకుని 95.03 వద్దకు చేరింది. భౌగోళిక ఉద్రిక్తతలు మరింత సద్దుమణిగితే రాబోయే రోజుల్లో మార్కెట్లు మరింత బలంగా పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.