తండ్రికి షాకిచ్చిన కొడుకు.
* దళపతి ఇంట ముదిరిన వివాదం.
* సోషల్ మీడియాలో తండ్రికి దూరమైన విజయ్ కుమారుడు.
* తండ్రిపై ఆగ్రహంతోనే జేసన్ సంజయ్ అన్‌ఫాలో?
హైదరాబాద్, మహా.
తమిళ సినీ పరిశ్రమలో, రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్న దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర ఆటుపోట్లు చోటుచేసుకుంటున్నాయి. భార్య సంగీతతో విడాకుల వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన వేళ, విజయ్‌కు ఆయన సొంత కొడుకు జేసన్ సంజయ్ ఊహించని షాకిచ్చాడు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రి విజయ్‌ను జేసన్ అన్‌ఫాలో చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబంలో నెలకొన్న విబేధాల కారణంగానే తండ్రితో కొడుకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాడని, ఈ విడాకుల వివాదంలో కొడుకు జేసన్ పూర్తిగా తల్లి సంగీత వైపే నిలబడ్డాడని నెట్టింట ప్రచారం జోరుగా సాగుతోంది.
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత దళపతి విజయ్ కుటుంబ విబేధాలు ఒక్కొక్కటిగా రచ్చకెక్కుతున్నాయి. ఏకంగా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విజయ్ సతీమణి సంగీత సోర్నలింగం ఇటీవలే చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన నాటి నుంచి నెట్టింట విజయ్ వ్యక్తిగత జీవితంపై అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన కుమారుడు, త్వరలో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న జేసన్ సంజయ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై అభిమానుల కన్ను పడింది. అందులో జేసన్ తాను ఫాలో అవుతున్న వ్యక్తుల జాబితాలో తండ్రి విజయ్ పేరు లేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
జేసన్ సంజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా విజయ్ సేతుపతి లాంటి పలువురు ప్రముఖులతో కలుపుకుని మొత్తం 35 మందికి పైగా వ్యక్తులను ఫాలో అవుతున్నాడు. కానీ, తన కన్నతండ్రి అయిన విజయ్‌ను మాత్రం అన్‌ఫాలో చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తల్లి సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే జేసన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని నెటిజన్లు బలంగా వాదిస్తున్నారు. విడాకుల వ్యవహారంలో తండ్రి తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూనే సంజయ్ ఈ రకంగా తన నిరసనను, తల్లి పట్ల తన మద్దతును తెలియజేస్తున్నాడని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు నెటిజన్లు జేసన్ ఇన్‌స్టా ఫాలోయింగ్ లిస్ట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను తీసి సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తుండటంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది.
అయితే, జేసన్ సంజయ్ మొదటి నుంచి తన తండ్రిని ఫాలో కావడం లేదని, ఈ విడాకుల వ్యవహారానికి, ఇన్‌స్టాగ్రామ్ అన్‌ఫాలోకు ఎలాంటి సంబంధం లేదని మరికొందరు అభిమానులు కొట్టిపారేస్తున్నారు. జేసన్ సంజయ్ ఎప్పటి నుంచో తన తండ్రి రాజకీయ పార్టీ (టీవీకే) ఖాతాను కానీ, విజయ్ అధికారిక ఖాతాను కానీ ఫాలో కావడం లేదని వారు వివరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, విజయ్-సంగీతల విడాకుల ప్రకటన తర్వాత కుటుంబ సభ్యుల ప్రతి కదలికపై మీడియా, అభిమానులు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. కుటుంబపరంగా వస్తున్న ఈ సవాళ్లను రాజకీయాల్లో ఉద్ధృతంగా అడుగులు వేస్తున్న దళపతి విజయ్ ఎలా అధిగమిస్తారోనని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తన తొలి సినిమాను డైరెక్ట్ చేసే పనిలో జేసన్ సంజయ్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకుల మధ్య ఈ సోషల్ మీడియా దూరం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.








