Mahaa Daily Exclusive

  ఏకమవుతున్న బద్ధ శత్రువులు?

Share

ఏకమవుతున్న బద్ధ శత్రువులు?
• తమిళనాడు పాలిటిక్స్‌లో ఊహించని పరిణామం.
*దళపతి విజయ్‌ను అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్.
* డీఎంకే, అన్నాడీఎంకే కొత్త పొత్తు?
* ప్రభుత్వ ఏర్పాటు దిశగా ద్రావిడ పార్టీల అడుగులు.
* కలిసినా దక్కని మ్యాజిక్ ఫిగర్.
* డీఎంకే, ఏఐఏడీఎంకేల ఉమ్మడి సంఖ్యాబలం 106 మాత్రమే.

హైదరాబాద్, మహా.

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికో కొత్త మలుపు తిరుగుతున్నాయి. దశాబ్దాలుగా ఉప్పు-నిప్పులా ఉండే రెండు ప్రధాన ద్రావిడ పార్టీలు ఏకం కాబోతున్నాయన్న వార్త ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేని దళపతి విజయ్ (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకునేందుకు డీఎంకే, ఏఐఏడీఎంకే (అన్నాడీఎంకే) పార్టీలు సరికొత్త పొత్తు దిశగా అడుగులు వేస్తున్నట్లు చెన్నై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. దశాబ్దాల నాటి రాజకీయ శత్రుత్వానికి ముగింపు పలుకుతూ, ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. అయితే, ఈ రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సాధించడం కష్టంగానే కనిపిస్తోంది.
ఈ ప్రతిష్టంభనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మాజీ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని డీఎంకే, అన్నాడీఎంకే వర్గాలు తెరవెనుక ముమ్మర మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడును దశాబ్దాల పాటు ఏలిన ఈ రెండు ద్రావిడ పార్టీలు, ఇప్పుడు ఓ కొత్త శక్తి చేతిలోకి అధికారం వెళ్లకుండా అడ్డుకునేందుకు తమ మధ్య ఉన్న సైద్ధాంతిక, రాజకీయ వైరాన్ని సైతం పక్కనపెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత కాలం నుంచి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య బద్ధ శత్రుత్వం కొనసాగుతోంది. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్షానికే పరిమితం అవుతూ వస్తున్నారు. అలాంటిది చరిత్రలో తొలిసారిగా ఈ రెండు పార్టీలు ఒకే గూటికి చేరి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుండటం కోలీవుడ్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్‌గా మారింది. విజయ్ రాజకీయ ఎదుగుదలను ఆదిలోనే కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ద్రావిడ పార్టీల మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనతోనే వారు ఈ చారిత్రక నిర్ణయానికి మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు రాజకీయంగా ఏకమైనప్పటికీ.. ఆచరణలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సంఖ్యాబలం వారి వద్ద కూడా లేదు. తాజా ఎన్నికల ఫలితాల ప్రకారం ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేల స్థానాలను కలిపినా ఆ సంఖ్య కేవలం 106కు మాత్రమే పరిమితం అవుతోంది. 234 స్థానాలున్న అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలంటే కనీసం 118 మంది (మ్యాజిక్ ఫిగర్) సభ్యుల మద్దతు అవసరం. అంటే, ఈ రెండు పార్టీల కూటమికి కూడా మరో 12 మంది ఎమ్మెల్యేల మద్దతు అత్యవసరం. దీంతో మిగిలిన చిన్న పార్టీలు, జాతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగట్టేందుకు ఈ ద్రావిడ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అటు విజయ్, ఇటు ద్రావిడ పార్టీల కూటమి మ్యాజిక్ ఫిగర్ కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుండటంతో చెన్నై రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. రాజ్‌భవన్ నిర్ణయం, మద్దతు కూడగట్టడంలో పార్టీల వ్యూహాలపైనే తమిళనాట నూతన ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉంది.