- విస్తరించనున్న హైడ్రా పరిధి
- రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తామన్న కమిషనర్ రంగనాథ్
- ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడి
మిర్యాలగూడ, మహా : రాష్ట్రవ్యాప్తంగా హైడ్రాను విస్తరించాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మిర్యాలగూడలో స్వయంగా వెల్లడించారు. మిర్యాలగూడలో రంగనాథ్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా సేవలు విస్తరించాలంటూ ప్రజల నుంచి వినతులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో హైడ్రాను రాష్ట్రమంతా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. హైడ్రాకు కబ్జాలపై వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయని.. ఆ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే నాలుగు వారాలు ప్రజావాణిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రంగనాథ్ తెలిపారు. హైడ్రాకు ఇప్పటికే చాలా ఫిర్యాదులు, దరఖాస్తులు వచ్చాయని వాటిని పరిష్కరించడం కోసమే నాలుగు వారాలు ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు వివరించారు.హైడ్రాకు వ్యతిరేకంగా కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు హైడ్రా చర్యల కారణంగా ఇప్పటి వరకూ సుమారుగా రూ. 85 వేల కోట్ల విలువైన భూములను కబ్జాల నుంచి కాపాడామని రంగనాథ్ వెల్లడించారు. మరో సంవత్సరంలోగా రూ.లక్ష కోట్లు విలువైన భూములను కాపాడుతామని స్పష్టం చేశారు. కేవలం హైడ్రా పరిధిలోనే పది లక్షల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురైనట్లు సమాచారం ఉందని హైడ్రా కమిషనర్ తెలిపారు.
జూన్ 8 నుంచి ప్రజావాణి తిరిగి ప్రారంభం
మరోవైపు జూన్ ఎనిమిదో తేదీ నుంచి హైడ్రా ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. పెండింగ్ ఫిర్యాదులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలనే ఉద్దేశంతో నాలుగు వారాల పాటుఈ కార్యక్రమానికి విరామం ఇచ్చారు.. ప్రజావాణితో పాటు, వివిధ రూపాల్లో వచ్చిన ఫిర్యాదులన్నీ క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విరామాన్ని ప్రకటించినట్లు తెలిపారు. అయితే గతంలో ఇచ్చిన ఫిర్యాదుదారులు అత్యవసరమని భావిస్తే కార్యాలయానికి వచ్చి నేరుగా కలవవచ్చని రంగనాథ్ తెలిపారు. అలాగే ముఖ్యమైన సమస్యలున్నా నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చునని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.








