Mahaa Daily Exclusive

  బంగాల్‌ అసెంబ్లీ రద్దు….ముగిసిన మమత 15 ఏళ్ల పాలన…

Share

హైదరాబాద్, మహా.
పశ్చిమ బంగాల్‌ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగిసింది. రాష్ట్రంలో ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రభంజనం సృష్టించి, స్పష్టమైన మెజారిటీ సాధించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో రాష్ట్రంలో గత 15 ఏళ్లుగా సాగుతున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (తృకాపా) ప్రభుత్వానికి తెరపడింది. రాజ్యాంగంలోని అధికరణ 174(2)(బి) ప్రకారం గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
**కాషాయ ప్రభంజనం.. కుప్పకూలిన కోట**
బంగాల్‌లోని మొత్తం 294 స్థానాలకు గాను (ఫల్తా నియోజకవర్గం మినహా 293 స్థానాలకు) జరిగిన పోరులో భాజపా ఏకంగా 207 సీట్లను కైవసం చేసుకుని అధికార పీఠాన్ని దక్కించుకుంది. 148 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటిన భాజపా, తృణమూల్ కాంగ్రెస్‌ను 80 స్థానాలకే పరిమితం చేసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా భబానీపూర్‌ నియోజకవర్గంలో సువేందు అధికారి చేతిలో పరాజయం పాలుకావడం గమనార్హం. 2011 నుంచి ఎదురులేకుండా సాగిన ‘దీదీ’ సామ్రాజ్యాన్ని కమలనాథులు ఈసారి పక్కా వ్యూహంతో మట్టికరిపించారు.
**నేడు భాజపా శాసనసభాపక్ష భేటీ**
అధికార పగ్గాలు చేపట్టేందుకు భాజపా శరవేగంగా అడుగులు వేస్తోంది. శుక్రవారం కోల్‌కతాలో భాజపా శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నాయకుడిని (ముఖ్యమంత్రిని) ఎన్నుకోనున్నారు. కేంద్ర పరిశీలకుల సమక్షంలో జరిగే ఈ సమావేశం అనంతరం, భాజపా నేతలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. శనివారం నాడు నూతన ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
**సందిగ్ధానికి తెరదించిన గవర్నర్**
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ తొలుత నిరాకరించడం రాష్ట్రంలో స్వల్ప రాజకీయ ఉత్కంఠకు దారితీసింది. ఓటమిని అంగీకరించేది లేదని, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. అయితే, అసెంబ్లీ గడువు ముగియడం, కొత్త మెజారిటీ పార్టీ సిద్ధంగా ఉండటంతో గవర్నర్‌ రవి రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీని, కేబినెట్‌ను రద్దు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీంతో గత ప్రభుత్వ పాలన అధికారికంగా ముగిసినట్లయింది. శనివారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోల్‌కతాలోని రెడ్‌ రోడ్‌ సర్వం సిద్ధమవుతోంది.