Mahaa Daily Exclusive

  గవర్నర్లు బీజేపీ ఏజెంట్లుగా మారారు….కపిల్ సిబల్ సంచలన ఆరోపణలు…

Share

హైదరాబాద్, మహా.
దేశంలోని గవర్నర్లు భారతీయ జనతా పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే (తమిళగ వెట్రి కళగం)ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆహ్వానించకపోవడంపై ఆయన మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని అధికార పార్టీకి ఎన్నికల ప్రక్రియను తారుమారు చేసే అవకాశం కల్పించేందుకే గవర్నర్ ఉద్దేశపూర్వకంగా సమయాన్ని వృథా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సిబల్.. గవర్నర్‌కు నిబంధనల గురించి అవగాహన ఉన్నప్పటికీ, బీజేపీ చెప్పినట్లు నడుచుకుంటున్నారని విమర్శించారు. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై గవర్నర్‌కు స్పష్టమైన అవగాహన ఉందని, ఆయన కచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పులను, సర్కారియా కమిషన్ సిఫార్సులను పాటించాలని డిమాండ్ చేశారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన వారిని తక్షణమే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం గవర్నర్ విధి అని గుర్తుచేశారు. కానీ, కావాలనే జాప్యం చేస్తూ ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. టీవీకే అధినేత గవర్నర్‌ను కలిసినప్పుడు ‘ముందు మెజారిటీ నిరూపించుకోండి’ అని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన చారిత్రక ‘బొమ్మై కేసు’ తీర్పును ఈ సందర్భంగా సిబల్ ఉటంకించారు. ఎవరికి మెజారిటీ ఉందో లేదో నిర్ణయించే అధికారం గవర్నర్‌కు లేదని, అది కేవలం అసెంబ్లీలో జరిగే బలపరీక్ష ద్వారానే తేలాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ఆయన వివరించారు. గవర్నర్ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని, ప్రజా తీర్పును కాలరాసే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గవర్నర్ తన తీరు మార్చుకుని, రాజ్యాంగ నిబంధనల ప్రకారం టీవీకేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్లు కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఈ పరిణామం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.