తెలంగాణ ప్రగతికి మోదీ భరోసా.
* పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న ‘మహా’ బహిరంగ సభ.
హైదరాబాద్, మహా.
తెలంగాణ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టబోతున్నారని, మే 10న హైదరాబాద్‌లో జరగనున్న బహిరంగ సభ రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని సభ ఏర్పాట్లను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ హెచ్‌ఐసీసీ నుంచి వర్చువల్ విధానంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు చేస్తారని వెల్లడించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును కాపాడగలిగేది కేవలం మోదీ నాయకత్వమేనని ఆయన నొక్కి చెప్పారు.
**తెలంగాణకు లక్షల కోట్ల నిధుల వెల్లువ**
గడిచిన 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సుమారు 12 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక సహకారం అందించిందని కిషన్ రెడ్డి వివరించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మోదీ ప్రధాని అయ్యే వరకు రాష్ట్రంలో కేవలం 2400 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే, గడిచిన 11 ఏళ్లలోనే అదనంగా మరో 2500 కిలోమీటర్ల రహదారులను నిర్మించామని ఆయన గుర్తుచేశారు. ఒకేసారి 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణతో పాటు రామగుండం ఎరువుల కర్మాగారం, ఎన్టీపీసీ ప్రాజెక్టులు, రైల్ తయారీ యూనిట్, సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి కానుకగా ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో కేంద్రం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.
**ప్రజా వెల్లువ.. సాంప్రదాయ స్వాగతం**
ఈ బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. మే 10 సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభ కోసం మూడు భారీ వేదికలను సిద్ధం చేస్తున్నారు. వేల సంఖ్యలో కాలనీవాసులు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, గృహిణులు స్వచ్ఛందంగా వాలంటీర్లుగా ముందుకొచ్చి పాసులు కోరడం విశేషమన్నారు. సుమారు వెయ్యి మంది లంబాడి మహిళలు తమ సాంప్రదాయ వేషధారణతో ప్రధానికి ఘనస్వాగతం పలకనున్నారని, గద్వాల, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, ఖమ్మం ప్రాంతాల నుంచి కార్యకర్తల కోసం ప్రత్యేక రైళ్లను బుక్ చేశామని వెల్లడించారు. ఎండలు తగ్గి వాతావరణం కూడా అనుకూలించడం ప్రధాని సభ విజయవంతానికి ప్రకృతి పలుకుతున్న స్వాగతంగా ఆయన అభివర్ణించారు.
**అప్పుల ఊబిలో రాష్ట్రం.. ‘డబుల్ ఇంజన్’ ఏకైక మార్గం**
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేశాయని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కరీంనగర్ నుంచి కామారెడ్డి వరకు ప్రతి చోటా అప్పుల వేటే తప్ప అభివృద్ధి జాడ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలకే పరిమితమయ్యారని, ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప మరేదీ సక్రమంగా అమలు కావడం లేదని మండిపడ్డారు. బంగారు తెలంగాణ అని కేసీఆర్, మార్పు అని రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను రక్షించుకోవాలంటే మోదీ నాయకత్వంలోని ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వం రాష్ట్రానికి అత్యవసరమని ఆయన పిలుపునిచ్చారు.
**కాషాయ జెండా దిశగా అడుగులు**
దేశవ్యాప్తంగా ప్రజలు మోదీ గ్యారెంటీని నమ్మి వరుసగా రెండో, మూడోసారి బీజేపీకి అధికారం కట్టబెడుతున్నారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రజలు చూపిన ఆదరణే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో కూడా అదే మార్పు మొదలైందని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. మే 10న జరిగే సభ తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడానికి బలమైన పునాది వేస్తుందని, “మోదీ కోసం మనం – దేశం కోసం మోదీ” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరై ప్రధాని ఆశీస్సులు తీసుకోవాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.








