Mahaa Daily Exclusive

  కరీంనగర్‌ జ్యువెలరీ షాప్‌ చోరీ కేసు…..

Share

  • కరీంనగర్‌ జ్యువెలరీ షాప్‌ చోరీ కేసు
  • ముగ్గురు నిందితుల అరెస్టు
  • పరారీలో మరో 10 మంది
  • అజ్ఞాతంలో చోరీ కేసు మాస్టర్ మైండ్ సుబోధ్ సింగ్
  • 2 నెలల క్రితమే 4 ప్రాంతాల్లో రెక్కీ
  • వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం

కరీంనగర్, మహా : రాష్ట్రంలో పెను సంచలనం రేపిన కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ ఘటనలో పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నారు. కరీంనగర్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశఁలో సీపీ గౌస్ ఆలం కేసు వివరాలను వెల్లడించారు. దొంగతనం కేసులో 2 నెలల క్రితమే నిందితులు.. 4 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారని తెలిపారు. ఈ దొంగతనంలో మొత్తం 13 మంది నిందితులు ఉన్నారని, 161 తులాల గోల్డ్, 112 క్యారెట్ల వజ్రాలు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. నిందితుల నుంచి పిస్టల్స్, వెహికల్స్, భారీగా ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌లో చోరీ చేసిన తర్వాత ఆ నగలు తీసుకుని పశ్చిమ బెంగాల్‌కు దొంగలు పరారయ్యారని పేర్కొన్నారు. నిందితులను బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో బిహార్‌కు చెందిన ‘ది గోల్డెన్ తీఫ్’ సుబోద్ సింగ్ మాస్టర్ మైండ్‌గా గుర్తించిన పోలీసులు.. అతడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఈ బంగారం చోరీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 13 మంది నిందితులు పాల్గొన్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం వెల్లడించారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా ఐదుగురు దొంగలు పాల్గొన్నారని, ఇప్పటివరకు ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గ్యాంగ్ లీడర్ సుబోద్ సింగ్ సహా 10 మంది నిందితుల ఆచూకీ ఇంకా దొరకలేదని పేర్కొన్నారు.

పీఎంజే జ్యువెలరీ షాప్‌లో దోపిడీకి ముందు నిందితులు ధర్మపురిలో ఆశ్రయం పొందినట్లు చెప్పారు. దొంగతనం తర్వాత వీరంతా 3 టీంలుగా విడిపోయి ధర్మపురి వద్ద తమ వాహనాలను వదిలేసి పారిపోయినట్లు తెలిపారు. అక్కడి నుంచి రైలు, బస్సు ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ ముగ్గురు నిందితుల నుంచి ఇప్పటివరకు రూ.51 వేల నగదుతోపాటు.. 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీళ్లు దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యాపారితో పాటు నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీస్ టీమ్‌లు గాలింపు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు సుబోధ్‌సింగ్‌ కాగా.. అత్యాధునిక టెక్నాలజీతో ఈ ముఠా అనేక దొంగతనాలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఈ చోరీ చేయడానికి ముందు 2 నెలల క్రితమే 4 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారని.. అన్నింటి తర్వాత చివరికి కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెల్లర్స్‌లో దోపిడీ చేశారని వెల్లడించారు. బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో సుబోధ్‌ సింగ్‌ ముఠా గతంలో చోరీలకు పాల్పడిందని.. కానీ మన రాష్ట్రంలో ఇలాంటి దోపిడీలు జరగడం ఇదే తొలిసారి అని సీపీ గౌష్ ఆలం తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.