Mahaa Daily Exclusive

  హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్ పై విచారణ……

Share

  • హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్ పై విచారణ
  • మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా
  • ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వారం రోజులకు వాయిదా
  • తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారన్న భగీరథ్ న్యాయవాది
  • న్యాయవాదులు సంయమనం పాటించాలన్న కోర్టు
  • బాధితురాలి వసును నిర్ధారించాలన్న కోర్టు

హైదరాబాద్, మహా : పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్‎ పిటిషన్‎పై శుక్రవారం విచారణ చేపడతామని పేర్కొంది . కాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‎పై హైదరాబాద్‎లోని పేట్ బషీర్‎బాద్‎ పోలీస్ స్టేషన్‎లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం భగీరథ్ హైకోర్టును ఆశ్రయించాడు. గురువారం హైకోర్టులో ఈ పిటిషన్‏పై విచారణ జరగగా.. భగీరథ్ తరుఫున ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పోక్సో కేసులోనూ పిటిషనర్‌కు కొన్ని హక్కులు ఉంటాయని, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 పరిధిలోకి పిటిషనర్ రారని వాదించారు. బీఎన్ఎస్ సెక్షన్ 74, 75 కింద ఆరోపణలు రుజువు కాలేదని కోర్టుకు వివరించారు. బాధితురాలిగా పేర్కొంటున్న యువతి మైనర్ కాదని, ఆమె వయసు 19-20 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. బాధితురాలి తల్లి తప్పుడు రికార్డులతో వయసు తగ్గించి పోక్సో కేసు పెట్టించారని ఆరోపించారు.

ఆ యువతి పలు రకాల తేదీలతో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ తీసుకుందన్నారు. ఈనెల8 న పేట్ బషీరాబాద్ పీఎస్‎లో నమోదైన ఫోక్సో కేసులో భగీరథ్‎పై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. తన క్లయింట్ నుంచి బాలిక ఫ్యామిలీ రూ.5 కోట్లు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడమే కాకుండా, ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు బెదిరించారని వాదించారు. బాధితుల నుంచి వచ్చిన బెదిరింపులకు లొంగకుండా కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. ప్రముఖ రాజకీయ వ్యక్తి కుమారుడు కావడంతో ఈ కుట్రకు పాల్పడ్డారన్నారు. ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు చేసాక సెక్షన్లు మార్చడం అనుమానాలకు దారి తీస్తుందన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశాక కావాలనే సెక్షన్లు మార్చారని, ఇది కుట్రపూరిత చర్యగా భావించాలని వాదించారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశాక.. వాస్తవాలు తెలుసుకుని సెక్షన్లు మార్చడం జరిగిందని బాధితురాలి తరుఫు లాయర్ కౌంటర్ ఇచ్చారు.

ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‎పై విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. బాధితురాలు పుట్టిన రోజు డేట్స్‎పై, గతంలో రాష్ డ్రైవింగ్ కేసులో అమ్మాయి మేజర్ అని పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ పట్ల పోలీసులు విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. వీటి ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే, ముందస్తు బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని భగీరథ్ తరుఫు లాయర్ కోరగా మధ్యంతర బెయిల్‎పై శుక్రవారం విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.

లాయర్లు సంయమనంతో వ్యవహరించాలి

బండి భగీరథ్​ను క్రిమినల్ అని బాధితురాలి తరఫు న్యాయవాది సంబోధించడంతో పిటిషనర్ తరఫు లాయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య వాగ్వాదంతో జడ్జి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేరనిరూపణ అయ్యేంతవరకు నేరస్తుడు అనకూడదని హైకోర్టు పేర్కొంది. లాయర్లకు సంయమనం లేకపోతే పిటిషన్​ను మరో బెంచ్​కు మార్చుకోవచ్చని సూచించింది. ఇరువైపులా న్యాయవాదులు సంయమనంతో వ్యవహరించాలని ఆదేశించింది. పిటిషనర్‌కు అన్ని కేసుల్లా కాకుండా ప్రత్యేకంగా బెయిల్‌ ఎందుకు అడుగుతున్నారని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది బదులిస్తూ బండి భగీరథ్​ ఎలాంటి ప్రత్యేక హోదాలో బెయిల్​ పిటిషన్​ దాఖలు చేయలేదన్నారు. 15-18 ఏళ్ల బాలిక బాధితురాలుగా ఉంటే బెయిల్ ఇవ్వొచ్చన్న తీర్పులు ఉన్నాయని వాదనలు వినిపించారు.

భగీరథ్​పై తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేశారని​ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదులో 4 సంఘటనలను పేర్కొన్నారని, వాటి కంటే ముందు, తర్వాత కూడా ఫోన్లలో మాట్లాడుకున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. గంటల తరబడి పిటిషనర్, బాధితురాలు ఫోన్లలో మాట్లాడుకున్నారని వివరించారు. మొదట ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిపై 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లు నమోదు చేశారా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఈనెల 8న బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హైకోర్టుకు పీపీ తెలిపారు. కేసు నమోదైన మరుసటి రోజు బాధితురాలి వాంగ్మూలం తర్వాత దర్యాప్తు అధికారి సెక్షన్లు మార్చారని వివరించారు. ఘటన జరిగిందని చెబుతున్న నాలుగున్నర నెలల తర్వాత పీఎస్‌లో ఫిర్యాదు చేశారని భగీరథ్‌ లాయర్‌ వాదనలు వినిపించారు.