Mahaa Daily Exclusive

  చిక్కులో కేటీఆర్…

Share

చిక్కులో కేటీఆర్.
* ఫార్ములా-ఈ కుంభకోణంలో సంచలనం.
* ఏ-1గా కే. తారక రామారావు.
* మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ కోర్టు సమన్లు.
* విచారణకు స్వీకరించబడిన ఫార్ములా-ఈ ఛార్జిషీట్.
* జులై 31న హాజరుకావాలని ఆదేశం.
* రూ.55 కోట్ల విదేశీ బదిలీ వ్యవహారంలో ఉచ్చు.
* కేటీఆర్ సహా ఐదుగురికి సమన్లు జారీ.

హైదరాబాద్, మహా.
గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కే. తారక రామారావు (కేటీఆర్)కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు గురువారం నాడు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డిలకు కూడా న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.
హైదరాబాద్ వేదికగా 2023లో నిర్వహించిన ఫార్ములా-ఈ ఈవెంట్ నిర్వహణలో భాగంగా సుమారు రూ. 55 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా ఒక విదేశీ కంపెనీకి బదిలీ చేశారనే ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో జరిగినట్లుగా భావిస్తున్న ఆర్థిక అవకతవకలపై పూర్తి వివరాలతో ఏసీబీ ఇటీవల న్యాయస్థానంలో ఛార్జిషీట్ (అభియోగపత్రం) దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్‌ను లాంఛనంగా విచారణకు స్వీకరించిన ప్రిన్సిపల్ ఎస్‌పీఈ అండ్ ఏసీబీ కేసెస్ కోర్టు కమ్ ఐవీ ఏసీజే.. ఈ కేసులోని నిందితులందరూ జులై 31వ తేదీన విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో మొత్తం ఐదుగురి పేర్లను నిందితులుగా చేర్చారు. ఇందులో మాజీ మంత్రి కే. తారక రామారావును నిందితుడు నంబర్ 1 (ఏవో-1)గా పేర్కొనగా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఏవో-2గా, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డిని ఏవో-3గా చేర్చారు. వీరితో పాటు స్పోర్ట్స్ కన్సల్టెంట్ గోవేద కిరణ్ మల్లేశ్వరరావును ఏ-4గా, యూకేకి చెందిన ఫార్ములా-ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ తరపున కో-ఫౌండర్ మరియు సీసీఓ మిస్టర్ అల్బెర్టో లాంగోను ఏ-5గా ఏసీబీ తన ఛార్జిషీట్‌లో స్పష్టం చేసింది. జులై 31, 2026 న జరగనున్న తదుపరి విచారణ కోసం వీరికి ఈ సమన్లు జారీ చేసినట్లు కోర్టు పత్రాల ద్వారా స్పష్టమవుతోంది.