Mahaa Daily Exclusive

  బండి భగీరథ్ పోక్సో కేసులో ఉత్కంఠ…

Share

బండి భగీరథ్ పోక్సో కేసులో ఉత్కంఠ.
* రంగంలోకి ఐదు ప్రత్యేక బృందాలు.
* లుక్ అవుట్ నోటీసులు జారీ.
* అజ్ఞాతంలోనే కేంద్ర మంత్రి కుమారుడు.
* పారిపోవడం సరికాదన్న సీఎం రేవంత్ రెడ్డి.
* దక్కని ముందస్తు బెయిల్.
* అర్ధరాత్రి వరకు కొనసాగిన హైకోర్టు విచారణ.
* ఆధారాల సేకరణలో పోలీసులు.
* ఎలాంటి రాజకీయ కక్షసాధింపులు లేవని స్పష్టీకరణ.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో నమోదైన ఈ కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్ కోసం పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేసు నమోదైన నాటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడంతో, విదేశాలకు పారిపోకుండా సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. తక్షణమే కుమారుడిని అప్పగించాలని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడం, మరోవైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన భగీరథ్‌కు చుక్కెదురు కావడంతో ఈ వ్యవహారం తుది అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
పరారీలో ఉన్న బండి భగీరథ్ ఆచూకీ కోసం మొత్తం ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. నిందితుడి మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కరీంనగర్, ఢిల్లీలోని బంధువులు, సన్నిహితుల ఇళ్లపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని కేంద్రమంత్రి నివాసానికి వెళ్లిన ఒక బృందం గంటపాటు తనిఖీలు నిర్వహించింది. మరోవైపు భగీరథ్ ఏ క్షణమైనా లొంగిపోతారనే ముమ్మర ప్రచారం సాగుతుండటంతో సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తును మోహరించారు. ఈనెల 12న విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా.. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, మరోరోజు స్టేషన్‌కు వస్తానని భగీరథ్ మెయిల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బండి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీ దేవి రాత్రి 9 గంటల నుంచి దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ కేసును ప్రత్యేకంగా విచారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, బాధిత బాలిక వాంగ్మూలాన్ని పరిశీలించిన అనంతరం ప్రస్తుత ప్రాథమిక దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. బాధితురాలి తరపున న్యాయవాది పప్పు నాగేశ్వరరావు సమర్థవంతంగా వాదనలు వినిపించారు. అంతేకాకుండా, బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో ఉంటూ దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున, విచారణ పూర్తయ్యే వరకు ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి నాగేశ్వరరావు లేఖ రాయడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఇలా పారిపోవడం నైతికంగా ఏమాత్రం సరైన పద్ధతి కాదని, ఆ తప్పిదం తండ్రికి తలవంపులు తెచ్చిందని ఆయన విమర్శించారు. దైర్యంగా విచారణను ఎదుర్కొంటేనే బండి సంజయ్‌కు గౌరవం పెరుగుతుందని, తక్షణమే కుమారుడిని పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేదంటే గడువు ముగియగానే పోలీసులు చట్టప్రకారం తమ పని తాము చేసుకుపోతారని స్పష్టం చేశారు. ఈ నెల 8న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాలిక మైనర్ కావడంతో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. అయితే, ఆశ్చర్యకరంగా ఆ ఫిర్యాదుకు రెండు గంటల ముందే భగీరథ్ ‘హనీ ట్రాప్’ పేరుతో కౌంటర్ ఫిర్యాదు చేశారని సీఎం గుర్తుచేశారు.
ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి రాజకీయ కక్షసాధింపు కుట్రలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. దేశంలోనే అత్యంత సున్నితమైన నగరమైన హైదరాబాద్‌లో ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఉన్నందున, ఆ పర్యటన ముగిసిన అనంతరం ఈ నెల 11న ప్రత్యేక సమీక్ష నిర్వహించి కేసు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించామన్నారు. కుమారుడు నేరం చేస్తే తండ్రిని అరెస్టు చేస్తారా అని ప్రశ్నించిన సీఎం.. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో యంత్రాంగం అత్యంత ఆచితూచి వ్యవహరిస్తోందని తెలిపారు. సుమారు నాలుగైదు నెలల క్రితం జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటనపై పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉందన్నారు. బాధితురాలు మేజర్ అని, రెండు బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో.. పాఠశాల రికార్డులు, ఆసుపత్రి జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు లాంటి వివరాలను పక్కాగా సేకరిస్తున్నట్లు వివరించారు. నిబంధనల ప్రకారం కాకుండా వందలాది పోలీసులతో దాడులు చేస్తే రాజకీయ వివక్ష అంటారని, తమ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షతో వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. తాము బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, సత్రం నడపడం లేదని సీఎం ఉద్ఘాటించారు.