Mahaa Daily Exclusive

  తెలంగాణ హెచ్‌ఆర్‌సీ తొలి చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య కన్నుమూత…

Share

తెలంగాణ హెచ్‌ఆర్‌సీ తొలి చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య కన్నుమూత.
* అనారోగ్యంతో హైదరాబాద్‌లో తుదిశ్వాస
* నేడు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
* తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన న్యాయ కోవిదులు, ప్రముఖులు.
హైద్రాబాద్, మహా.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) తొలి చైర్మన్ డాక్టర్ జస్టిస్ గుండ చంద్రయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, మానవ హక్కుల పరిరక్షకుడిగా సుదీర్ఘకాలం పాటు ఆయన అందించిన విశేష సేవలు న్యాయ వర్గాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
జస్టిస్ జి. చంద్రయ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుత మంచిర్యాల జిల్లా) జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో 1954 మే 10న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనే పూర్తి చేసిన ఆయన, ఆదిలాబాద్‌లో డిగ్రీ చదివారు. అనంతరం ఉన్నత విద్యాభ్యాసం కోసం హైదరాబాద్‌కు చేరుకుని ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పట్టాలతో పాటు, పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1980 నవంబర్‌లో బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.
న్యాయవాదిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చంద్రయ్య, ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖలకు న్యాయవాదిగా, వివిధ సంస్థలకు స్టాండింగ్ కౌన్సెల్‌గా విశేష సేవలందించారు. ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాల పక్షాన అనేక కేసుల్లో వాదనలు వినిపించి వారికి అండగా నిలిచారు. ఆయన న్యాయ పరిజ్ఞానాన్ని, నిబద్ధతను గుర్తించిన ప్రభుత్వం 2005 మే నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఆయనకు అవకాశం కల్పించింది. 2006 ఫిబ్రవరిలో ఆయన హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు పదకొండేళ్ల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా ఎన్నో చారిత్రాత్మక తీర్పులు వెలువరించిన ఆయన, సీనియర్ న్యాయమూర్తి హోదాలో 2016లో పదవీ విరమణ పొందారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏర్పాటైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు తొలి చైర్మన్‌గా జస్టిస్ చంద్రయ్యను రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబర్‌లో నియమించింది. హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆయన తీవ్రంగా స్పందించారు. రక్షణ లేని అట్టడుగు వర్గాలకు సత్వర న్యాయం అందేలా ఎన్నో కేసులను సుమోటోగా స్వీకరించి, బాధితులకు బాసటగా నిలిచారు. సామాజిక న్యాయం, మానవ హక్కుల పరిరక్షణలో ఆయన చూపిన చొరవకు గుర్తింపుగా 2022లో ఆయనను పలు సంస్థలు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించాయి.
జస్టిస్ చంద్రయ్య మరణవార్త తెలుసుకున్న న్యాయ, రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భౌతికకాయానికి పలువురు హైకోర్టు ప్రస్తుత, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు నివాళులర్పించారు. దళిత, బహుజన వర్గాల నుంచి ఎదిగి గొప్ప న్యాయ కోవిదుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని సమాజం కోల్పోయిందని వారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జస్టిస్ చంద్రయ్య అంత్యక్రియలు నేటి ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.