Mahaa Daily Exclusive

  వెండి దిగుమతులపై నిషేధం….

Share

వెండి దిగుమతులపై నిషేధం.
* 15 శాతానికి చేరిన బంగారం సుంకం!
* ఆర్థిక వ్యవస్థ రక్షణకై కేంద్ర ప్రభుత్వ మాస్టర్ స్ట్రోక్.
* అన్ని రూపాల్లో వెండి దిగుమతులపై తక్షణ బ్యాన్.
* పశ్చిమాసియా సంక్షోభం, విదేశీ మారక నిల్వల పతనం నేపథ్యంలో కఠిన చర్యలు.
* కొద్ది రోజుల క్రితమే 6 నుంచి 15 శాతానికి పెరిగిన బంగారం దిగుమతి సుంకం.
హైదరాబాద్, మహా.

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ మారక నిల్వలను పొదుపు చేసేందుకు ఉక్కుపాదం మోపింది. దేశంలోకి వెండి దిగుమతులను తక్షణమే నిలిపివేస్తూ సంచలన ప్రకటన చేసింది. అన్ని రూపాల్లో (ముడి వెండి, ఆభరణాలు, ఇతర వస్తువులు) వెండి దిగుమతులపై పూర్తిస్థాయిలో నిషేధం (బ్యాన్) విధిస్తూ కఠిన ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. విదేశీ మారక నిల్వలు కరిగిపోకుండా అడ్డుకట్ట వేయడానికి, దేశ వాణిజ్య లోటును కట్టడి చేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ ఆకస్మిక చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే బంగారం దిగుమతి సుంకాన్ని కేంద్రం భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా వెండి దిగుమతులపై ఆంక్షల వలయం బిగించడం దేశీయ బులియన్ మార్కెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
**విదేశీ మారక నిల్వల రక్షణే లక్ష్యంగా భారీ స్కెచ్**
గత కొంతకాలంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ముడి చమురు ధరల పెరుగుదల వల్ల రూపాయితో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ప్రధానంగా బంగారం, వెండి దిగుమతుల కోసం దేశం నుంచి భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యం (డాలర్లు) బయటకు వెళ్లిపోతోంది. దీనివల్ల దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఈ మాస్టర్ స్ట్రోక్ వేసింది. ముందస్తు ప్రభుత్వ లైసెన్స్ లేదా అనుమతులు లేకుండా ఎలాంటి వెండిని స్వేచ్ఛగా దిగుమతి చేసుకోకూడదని డీజీఎఫ్‌టీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సెజ్ యూనిట్లు, ఎగుమతి ఆధారిత సంస్థల మినహా, సాధారణ కొనుగోలుదారులు, వ్యాపారులకు ఈ నిషేధం వర్తిస్తుందని నిబంధనలను కఠినతరం చేసింది. ఉత్పాదకత లేని ఈ దిగుమతులను దాదాపుగా నిషేధిత జాబితాలోకి నెట్టేసినట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
**బంగారం దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు**
వెండిపై ఆంక్షలు విధించడానికి కొద్ది రోజుల ముందే, కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకం పై కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోకి పసిడి దిగుమతులను భారీగా నిరుత్సాహపరచాలనే ఉద్దేశంతో, కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఆభరణాల రంగానికి ఊరటనిస్తూ ఈ సుంకాన్ని 6 శాతానికి తగ్గించిన ప్రభుత్వం, మారుతున్న ప్రపంచ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మళ్లీ దాన్ని 2022 నాటి గరిష్ట స్థాయి అయిన 15 శాతానికి అమాంతం పెంచేసింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్ సామాజిక సంక్షేమ సర్ ఛార్జ్ తదితర పన్నులన్నీ కలిపి ఈ సుంకం 15 శాతానికి చేరింది.
**ప్రధాని మోడీ పిలుపు.. ఆ వెంటే కఠిన నిర్ణయాలు**
దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా, జాతీయ ప్రయోజనాల కోసం కనీసం ఏడాది పాటు పౌరులెవరూ అత్యవసరం కాని బంగారం కొనుగోళ్లు చేయవద్దని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని ఆ ప్రకటన చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే కేంద్రం ఈ స్థాయిలో పన్నులు పెంచడం, వెండిపై నిషేధాస్త్రాలు ప్రయోగించడం గమనార్హం. కేవలం ముడి చమురు, రక్షణ పరికరాలు, ఎరువులు, పారిశ్రామిక ముడిసరుకు లాంటి అత్యవసర వస్తువుల దిగుమతులకే విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, దిగుమతి సుంకాలు ఈ స్థాయిలో పెంచడం, ముడి వెండిపై ఆంక్షలు విధించడం వల్ల దేశంలోకి అక్రమ రవాణా (స్మగ్లింగ్) భారీగా పెరిగే ప్రమాదం ఉందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు ముందస్తు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా కేంద్రం తీసుకున్న ఈ వరుస తాజా నిర్ణయాలు దేశీయ మార్కెట్‌లో బులియన్ ధరల మంట పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.