Mahaa Daily Exclusive

  సంక్షోభం తలెత్తినా దేశానికి ఇక ‘నో టెన్షన్’…

Share

సంక్షోభం తలెత్తినా దేశానికి ఇక ‘నో టెన్షన్’.
*నయా పైసా ఖర్చు లేకుండా మన గడ్డపై 30 మిలియన్ బారెళ్ల చమురు!
* భారత పన్ను చెల్లింపుదారులపై సున్నా భారం.. అత్యవసరమైతే ఆ చమురు మనదే.
* ప్రధాని మోదీ పర్యటనతో కుదిరిన చారిత్రక ‘ఎనర్జీ డిప్లమసీ’ ఒప్పందం.
*అరబ్ దేశాల ఆయిల్.. మన గడ్డపై సేఫ్.. చాణక్య దౌత్యంతో ప్రపంచం అవాక్.
హైదరాబాద్, మహా.

మధ్యప్రాచ్యంలో (మిడిల్ ఈస్ట్) యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకినా సరే.. ఇకపై భారతదేశానికి ఎలాంటి టెన్షన్ లేదు. అగ్రరాజ్యాలు సైతం ఇంధన భద్రత కోసం అల్లాడుతున్న ప్రస్తుత తరుణంలో, భారత ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకమైన మాస్టర్ స్ట్రోక్ వేసింది. నయా పైసా ఖర్చు లేకుండా, విదేశీ చమురును మన గడ్డపై భద్రపరుచుకునే చారిత్రాత్మక ఒప్పందానికి తెరతీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల యూఏఈ పర్యటన ముగించుకున్న వెంటనే ఈ అద్భుతమైన ఒప్పందం కుదిరింది. నవభారత దౌత్య సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పిన ఈ ఒప్పందం ప్రకారం.. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ భారతదేశానికి చెందిన ‘స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్’ (వ్యూహాత్మక చమురు నిల్వలు) లో ఏకంగా 30 మిలియన్ బారెళ్ల ముడి చమురును నిల్వ చేయడానికి సిద్ధమైంది.
**పన్ను చెల్లింపుదారులపై ఒక్క రూపాయి భారం లేదు**
ఈ ఒప్పందం భారతదేశానికి వంద శాతం అత్యంత లాభదాయకంగా రూపొందింది. మన దేశంలో చమురు నిల్వ చేయడానికి అయ్యే మౌలిక వసతుల ఖర్చుతో సహా మొత్తం వ్యయాన్ని యూఏఈ ప్రభుత్వమే స్వయంగా భరిస్తుంది. దీనివల్ల భారతీయ పన్ను చెల్లింపుదారులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు. నిల్వ చేస్తున్న ఆ చమురుపై యాజమాన్య హక్కులు వారివే అయినప్పటికీ.. భారతదేశానికి ఏదైనా అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) వస్తే మాత్రం, మొదట ఆ చమురును వాడుకునే పరమ పవిత్రమైన హక్కును భారత్‌కే కల్పించారు. అంతర్జాతీయంగా చమురు సరఫరా ఎక్కడైనా నిలిచిపోయినా, మనకు తక్షణ ఇంధన భద్రత లభించేలా అత్యంత పక్కాగా ఈ ఒప్పందాన్ని రచించారు. ముడి చమురుతో పాటు వ్యూహాత్మక గ్యాస్ నిల్వలు, దీర్ఘకాలిక ఎల్‌పీజీ సరఫరాలపై కూడా ఇరు దేశాల మధ్య కీలక అడుగులు పడ్డాయి.
**ఆ ఐదారు రోజులు.. దేశానికి ప్రాణదాత**
ఈ ఒప్పందం భారత్‌కు ఎందుకు అంత కీలకం అంటే.. 30 మిలియన్ బారెల్స్ చమురు అనేది భారతదేశం యొక్క మొత్తం ఐదారు రోజుల వినియోగంతో సమానం. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా భారీ యుద్ధం వచ్చినా, గల్ఫ్ దేశాల వద్ద ఉండే కీలకమైన హార్ముజ్ జలసంధి దిగ్బంధనానికి గురైనా, లేదా ఓపెక్ దేశాల్లో తీవ్రమైన సంక్షోభం తలెత్తినా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి అత్యవసర సమయాల్లో చమురు ట్యాంకర్ల కోసం ఇతర దేశాల వద్ద చేయిచాపాల్సిన పనిలేదు. మన సొంత గడ్డపై మన కళ్లెదుటే సిద్ధంగా ఉన్న ఈ 30 మిలియన్ బారెళ్ల నిల్వలను నేరుగా వాడుకుని దేశ ఆర్థిక వ్యవస్థను, రవాణాను స్తంభించిపోకుండా కాపాడుకోవచ్చు.
**ఇది దాతృత్వం కాదు.. పక్కా చమురు దౌత్యం**
యూఏఈ ఈ ఒప్పందానికి ఎందుకు అంగీకరించిందనే దాని వెనుక అతిపెద్ద వ్యూహం దాగి ఉంది. గల్ఫ్ దేశాల నుండి చమురు ఎగుమతి చేసే సముద్ర మార్గాల్లో దశాబ్దాలుగా తీవ్రమైన భద్రతా లోపాలు, ముప్పు పొంచి ఉన్నాయి. ఈ రిస్క్‌ను అబుదాబీ దేశం ఇప్పుడు అధిగమించింది. సురక్షితమైన భారత గడ్డపై ఆ చమురును దాచుకుని తమ భద్రతను ఖాయం చేసుకుంటే, వారికి ఆ ఆశ్రయం కల్పించినందుకు ప్రతిఫలంగా అత్యవసర పరిస్థితుల్లో వాడుకునే ప్రయోజనం భారత్‌కు దక్కుతుంది. ఇది దాతృత్వం ఎంతమాత్రం కాదు.. అత్యంత పక్కాగా, వ్యూహాత్మకంగా సాగిన చమురు దౌత్యం . యూఏఈ తన రిస్క్‌ను తగ్గించుకుంటే, భారత్ వేరొకరి ఖర్చుతో తన ఇంధన బలాన్ని భారీగా పెంచుకుంది.
ప్రపంచమంతా మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలను చూసి ఆందోళన చెందుతుంటే, భారత్ మాత్రం అద్భుతమైన వ్యూహంతో తన ఇంధన భద్రతను సుస్థిరం చేసుకుంది. దశాబ్దాల తరబడి చేసిన చర్చలు సాధించలేని వ్యూహాత్మక లోతును, ప్రధాని మోదీ గారి ఈ ఒక్క పర్యటన సాధించి చూపించింది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఇంధన విపత్తు వచ్చినా భారత్ ఏమాత్రం ఇబ్బంది పడదు.. ఎందుకంటే ఆ లక్షలాది బారెళ్ల చమురు నిల్వల తాళాలు ఇప్పటికే మన చేతికి వచ్చేశాయి.