Mahaa Daily Exclusive

  ఓయో రూమ్ వీడియోలతో….

Share

  • ఓయో రూమ్ వీడియోలతో
  • ప్రభుత్వ అధికారికి మహిళ వేధింపులు
  • పంజాగుట్ట పోలీసుస్టేషన్ లో కేసు నమోదు

హైదరాబాద్, మే 18: నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి హనీ ట్రాప్ కావడం సంచలనం సృష్టిస్తోంది. ఓయో రూమ్‌లో రికార్డు చేసిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను చూపిస్తూ ఒక మహిళ సదరు అధికారిని గత మూడేళ్లుగా బ్లాక్‌మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేసింది. చివరకు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా భాగోతం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ కార్యాలయంలో పని చేస్తున్న ఒక ప్రభుత్వ ఉన్నతాధికారికి గతంలో ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వారిద్దరూ కలిసి ఒక ఓయో హోటల్ గదికి వెళ్లారు. ఆ సమయంలో సదరు మహిళ అధికారికి తెలియకుండా వారిద్దరి ప్రైవేట్ ఫోటోలను, వీడియోలను మొబైల్‌లో రికార్డు చేసింది. ఆ వీడియోలను ఆసరాగా చేసుకుని సదరు మహిళ అసలు రంగు బయటపెట్టింది. డబ్బులు ఇవ్వాలని లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం మొదలు పెట్టింది. అలా గత మూడేళ్లుగా ఆమె సదరు అధికారి నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తూ, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేసింది. ఇక భరించలేకపోయిన ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ అధికారి చివరకు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్న మహిళపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలైన మహిళపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.