- పట్టపగలు
- 10 మంది చూస్తుండగానే
- స్పా సెంటర్ లోకి చొరబడి భార్యను చంపిన భర్త
- కవాడిగూడలో కలకలం
హైదరాబాద్, మహా : హైదరాబాద్ నగరంలో మంగళవారం ఒక ఘోర హత్య కలకలం రేపింది. కట్టుకున్న భార్యపై ఉన్న కోపంతో, ఆమె పనిచేస్తున్న చోటికే వెళ్లిన భర్త కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి అతి కిరాతకంగా చంపేశాడు. స్పా సెంటర్‌లోకి చొరబడి ఈ ఘాతుకానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం బహదూర్‌పూర్ పరిధిలోని కిషన్‌బాగ్‌లో నివసిస్తున్న బంగి దేబోరా అనే మహిళ కవాడిగూడలోని ఒక ప్రముఖ స్పా సెంటర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. గత కొంతకాలంగా దేబోరా, ఆమె భర్త మధ్య కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. రోజూలాగే మంగళవారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన దేబోరా, ఆ గొడవను పక్కనబెట్టి తన విధులకు హాజరయ్యేందుకు కవాడిగూడలోని స్పా సెంటర్‌కు వచ్చేసింది.
భార్య తనతో గొడవపడి వెళ్లడాన్ని తట్టుకోలేకపోయిన భర్త, ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలనే పగతో కత్తితో కవాడిగూడకు బయలుదేరాడు. కవాడిగూడ రత్నదీప్ బిల్డింగ్‌లోని నాలుగవ అంతస్తులో ఉన్న స్పా సెంటర్‌కు చేరుకున్న నిందితుడు, ఒక్కసారిగా లోపలికి చొరబడ్డాడు. అక్కడ పనిచేస్తున్న దేబోరాపై తను వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె తేరుకునేలోపే కత్తితో పలుమార్లు పొడవడంతో, తీవ్ర రక్తస్రావమై దేబోరా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్పాలోని ఇతర సిబ్బంది భయంతో కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు
కవాడిగూడలో భార్యను దారుణంగా హత్య చేసిన అనంతరం నిందితుడు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. మరోవైపు సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు ప్రధాన కారణమని భావిస్తున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని నిందితుడిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. పట్టపగలే కవాడిగూడ లాంటి రద్దీ ప్రాంతంలో ఈ దారుణం జరగడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.








