- పబ్లిక్ ప్లేసుల నుంచి
- వీధి కుక్కలను తరలించాల్సిందే
- రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు
- పిచ్చి కుక్కలకు కారుణ్య మరణం
- అధికారులకు అనుమతి
న్యూఢిల్లీ, మహా : వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్ల వంటి రద్దీ ప్రదేశాల నుంచి కుక్కలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. నిబంధనలు పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. గత ఏడాది నవంబర్‌లో ఇచ్చిన మార్గదర్శకాలను సడలించేందుకు నిరాకరించడమే కాకుండా, వాటిని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఇన్‌స్టిట్యూషనల్ ఏరియాల నుంచి కుక్కల బహిష్కరణ
పాఠశాలలు, ఆస్పత్రులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, రైల్వే స్టేషన్లు, బస్ డిపోల వంటి అత్యంత రద్దీ ఉండే ప్రదేశాల్లో వీధి కుక్కలు ఉండకూడదని ధర్మాసనం ఖరాఖండిగా చెప్పింది. సాధారణంగా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశాక, వాటిని ఎక్కడ పట్టారో మళ్లీ అదే చోట వదిలిపెడతారు. కానీ, ఇకపై ఈ కీలక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆవరణల నుంచి తీసుకెళ్లిన కుక్కలను మళ్లీ అక్కడ వదలకూడదని కోర్టు తేల్చి చెప్పింది. ప్రజల భద్రతే అన్నిటికంటే ముఖ్యమని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.
పిచ్చి కుక్కలకు కారుణ్య మరణం
ఈ తీర్పులో మరో కీలకమైన అంశం ‘కారుణ్య మరణం’. ప్రాణహాని కలిగించే పిచ్చి కుక్కలు లేదా అత్యంత ప్రమాదకరంగా మారి మనుషులపై దాడులు చేస్తున్న కుక్కలను చట్టబద్ధమైన పద్ధతుల్లో ‘కారుణ్య మరణం’ ప్రసాదించేందుకు అధికారులకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. “ప్రజలు కుక్క కాటుకు గురవుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోకూడదు. పౌరులకు గౌరవంగా, ఎలాంటి భయం లేకుండా జీవించే హక్కు ఉంది” అని ధర్మాసనం పేర్కొంది.
ఆందోళనకరంగా గణాంకాలు
తమిళనాడులో కేవలం నాలుగు నెలల్లో రెండు లక్షల కుక్క కాటు కేసులు నమోదు కావడం, రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో నెల రోజుల్లోనే వెయ్యికి పైగా కేసులు రావడంపై కోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నారుల ముఖాలు కుక్కల దాడుల్లో చిధ్రమవుతుంటే పాలన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సరికాదని చురకలు అంటించింది. ఒకవేళ ఈ ఆదేశాలను పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు హెచ్చరించింది. ఆదేశాలు ధిక్కరిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతారు. బాధ్యులైన అధికారుల నుంచి నష్టపరిహారం వసూలు చేస్తారు. ప్రభుత్వ యంత్రాంగంపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. ప్రతి జిల్లాలో ఏబీసీ సెంటర్ తప్పనిసరి.
కుక్కల జనాభాను అదుపు చేసే యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనలను రాష్ట్రాలు సరిగ్గా అమలు చేయడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం నామమాత్రపు చర్యలతో కుదరదని, ప్రతి జిల్లాలో కనీసం ఒక పూర్తిస్థాయి ఏబీసీ సెంటర్ ఉండాలని ఆదేశించింది. అక్కడ అవసరమైన శిక్షణ పొందిన సిబ్బంది, వ్యాక్సినేషన్ సౌకర్యాలు ఉండాలి. అలాగే అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్ మందులు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో చిన్నారి ప్రదీప్‌పై కుక్కలు దాడి చేసి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా ఏపీ, తెలంగాణలో దాడులు ఆగలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు మున్సిపల్ అధికారులను పరుగులు పెట్టించనుంది. పౌరుల భద్రత కోసం తీసుకునే చర్యల్లో అధికారులకు రక్షణ ఉంటుందని, వారిపై అనవసరంగా కేసులు పెట్టకూడదని కూడా కోర్టు పేర్కొంది.







