Mahaa Daily Exclusive

  వాహనదారులకు షాక్…

Share

  • వాహనదారులకు షాక్
  • మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
  • డీజిల్, పెట్రోల్ పై 90 పైసలు పెంపు

న్యూఢిల్లీ, మహా : వాహనదారులకు వరుస షాకులు తగులుతున్నాయి. 5 రోజుల వ్యవధిలో రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 90 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఇంధన ధరలు పెరగడం వాహనదారులను ఇబ్బంది పెడుతోంది. పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుల గమనిస్తే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరగనున్నాయని అర్థమవుతోంది. ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు మాత్రమే ధరలు పెంచుతున్నాయని కేంద్రం చెబుతోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లో రూ. 110.89 ఉన్న లీటర్ పెట్రోల్ ధర మంగళవారం రూ. 111.88కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 97.77 నుంచి రూ. 98.64 కు చేరుకుంది. అలాగే డీజిల్ ధర లీటరుకు రూ. 90.67 నుంచి రూ. 91.58 కి పెరిగింది. గత శుక్రవారం కూడా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు దాదాపు రూ. 3 చొప్పున పెంచాయి.

కొత్త ఇంధన ధరలు ఇవే..

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.89 నుంచి రూ.111.88కి చేరింది

ఢిల్లీలో పెట్రోల్ రూ. 98.64, డీజిల్ లీటరుకు రూ. 91.58 కి చేరుకుంది.

ముంబైలో పెట్రోల్ రూ. 107.59, డీజిల్ లీటరుకు రూ. 94.08 అయింది.

కోల్‌కతాలో పెట్రోల్ రూ. 109.70, డీజిల్ లీటరుకు రూ. 96.07 గా నమోదైంది.

చెన్నైలో పెట్రోల్ రూ. 104.49, డీజిల్ లీటరుకు రూ. 96.11 అయింది.

జైపూర్‌లో పెట్రోల్ ధర రూ. 108.84, డీజిల్ ధర లీటరుకు రూ. 94.12 కి చేరుకుంది.

డీజిల్ కొత్త ధరల వివరాలు

హైదరాబాద్‌లో డీజిల్ లీటర్ ధర రూ.98.96 నుంచి రూ.99.95 చేరింది.

ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 91.58 అయింది.

కోల్‌కతాలో లీటర్ డీజిల్ ధర రూ. 96.07 కు చేరుకుంది.

ముంబయిలో లీటర్ డీజిల్ ధర రూ. 94.08 అయింది

చెన్నైలో లీటర్ డీజిల్ ధర రూ. 96.11కు చేరుకుంది.

ప్రభుత్వ చమురు కంపెనీలకు నష్టాలు

భారత ప్రభుత్వ చమురు కంపెనీలు గత 4 సంవత్సరాలుగా రిటైల్ ధరలను పెంచలేదు. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ (ముడిచమురు) ధరలు పెరగడం వల్ల ఈ కంపెనీలకు ప్రతిరోజూ దాదాపు రూ. 1000 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ధరలను క్రమంగా పెంచుతున్నారు. గతంలో రూ. 3 పెంచిన తర్వాత ఈ నష్టం కొద్దిగా తగ్గి రోజుకు రూ. 750 కోట్లకు చేరుకుంది. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు 90 పైసల చొప్పున వాహనదారులపై బారం పడింది. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌ చమురు సంక్షోభాన్ని బాగానే తట్టుకుని నిలబడింది. పలు దేశాల్లో ఇంధన ధరలు గత రెండు నెలలో 50 నుంచి 100 శాతం మేర పెరిగాయి.