Mahaa Daily Exclusive

  సంక్షోభంలోనూ ఇంధన ధరల నియంత్రణ మోదీ ఘనతే.

Share

  • కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు.
  •  కాలేశ్వరం సీబీఐ విచారణ ఓ ప్రహసనం.
  •  ధాన్యం, మొక్కజొన్న రైతులపై కక్షగట్టిన కాంగ్రెస్ సర్కార్.
  •  రూ.10 లక్షల కోట్ల కేంద్ర నిధులపై కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు.
  •  నాడు ఉగ్రవాదానికి కాంగ్రెస్ బుజ్జగింపులు.
  •  నేడు ‘ఆపరేషన్ సింధూర్’తో మోదీ ఉక్కుపాదం.
  •  ఖమ్మం గడ్డపై కాషాయ జెండా ఎగరేయండి.
  •  కేంద్ర బలంతో జిల్లాను నంబర్ వన్ చేస్తాం.
  •  ఖమ్మంలో మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నరపురాజు రామచంద్ర రావు.

హైదరాబాద్, మహా.

అంతర్జాతీయంగా చమురు సంక్షోభం వెంటాడుతున్నా దేశంలో ఇంధన ధరలను అదుపులో ఉంచిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌దేనని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణను వంతులవారీగా కొల్లగొడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని, కాలేశ్వరం సీబీఐ విచారణ పేరుతో ఈ రెండు పార్టీలు చీకటి ఒప్పందాలకు తెరలేపాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరావు అధ్యక్షతన జరిగిన జరిగిన ప్రశిక్షణ తరగతుల అనంతరం. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రం తెలంగాణకు రూ.10 లక్షల కోట్ల నిధులిచ్చినా కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని, రైతాంగ సంక్షోభాన్ని పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ చమురు మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురైందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ అవసరాలకు కేవలం 10 శాతం మాత్రమే సొంతంగా క్రూడ్ ఆయిల్ లభిస్తోందని, మిగిలిన 90 శాతానికి ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగినప్పటికీ, యూరప్ దేశాల్లో 15 నుండి 26 శాతం, ఐర్లాండ్‌లో 28 శాతం, చివరికి పాకిస్థాన్‌లో 54 శాతం వరకు ఇంధన ధరలు పెరిగినా, భారత్‌లో మాత్రం కేవలం రూ.3 మేరకే పెంపు జరిగిందని గుర్తుచేశారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుచూపునకు, వ్యూహాత్మక ఇంధన భద్రతకు నిదర్శనమని కొనియాడారు. అయితే దేశంలో స్వల్పంగా ధరలు పెరగడాన్ని సాకుగా చూపుతూ కాంగ్రెస్, ఇండీ కూటమి, బీఆర్ఎస్ పార్టీలు బాధ్యతారహితంగా రాజకీయ లాభాల కోసం ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని మండిపారు. గత యూపీఏ ప్రభుత్వం ఆయిల్ బాండ్ల పేరిట చేసిన లక్షల కోట్ల అప్పుల భారాన్ని భవిష్యత్తు తరాలపై నెట్టివేసిందని, ఆ ఆర్థిక దుర్వినియోగాన్ని దేశం ఇప్పటికీ భరిస్తోందని ఆరోపించారు.

తెలంగాణ రాజకీయాలపై విరుచుకుపడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, ఇవి సమాజాన్ని వంతులవారీగా కొల్లగొడుతున్న దొంగల ముఠాలుగా మారాయని రామచంద్రరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటే, ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆ లోటును భర్తీ చేస్తూ ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా కొల్లగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద అవినీతి కుంభకోణమైన కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న సీబీఐ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. పూర్తి స్థాయి విచారణ జరపకుండా, కేవలం కొన్ని చిన్నపాటి సాంకేతిక విషయాలను మాత్రమే సీబీఐకి అప్పగించి అసలు దోషులను, బీఆర్ఎస్ పెద్దలను రక్షించే ప్రయత్నం చేస్తోందని, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాలకు ఈ తూతూమంత్రపు విచారణే నిదర్శనమని కుండబద్దలు కొట్టారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న కాంగ్రెస్ పాలకులకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారన్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు సుమారు రూ.10 వేల కోట్లకు పైగా పేరుకుపోయాయని, పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో బీజేపీ పాత్ర కీలకమైనదని, దివంగత సుష్మాస్వరాజ్ పార్లమెంటులో బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభంపై ఆయన అత్యంత ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరవకపోవడం వల్ల వరి, మొక్కజొన్న పండించిన అన్నదాతలు ఐకేపీ కేంద్రాల వద్ద వారాల తరబడి కన్నీరు పెడుతూ పడిగాపులు కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లు యజమానులు, ఐకేపీ నిర్వాహకులు తేమ, తాలు పేరుతో క్వింటాళ్లకు కిలోల కొద్దీ అక్రమ తరుగు తీస్తూ దోచుకుంటున్నా పాలకులు కంటినిండా నిద్రపోతున్నారని విమర్శించారు. దళారుల చేతుల్లో మొక్కజొన్న రైతులు విలవిలలాడుతున్నా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేయడం వల్లే ఆయిల్ పామ్, వరి, పత్తి పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. తక్షణమే పూర్తి స్థాయిలో రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసి, ప్రతి గింజనూ మద్దతు ధరతో సేకరించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.

కేంద్ర నిధుల అంశంపై మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణకు వివిధ రూపాల్లో సుమారు రూ.10 లక్షల కోట్ల నిధులను మంజూరు చేసిందని కచ్చితమైన గణాంకాలతో స్పష్టం చేశారు. ఇందులో పన్నుల వాటా కింద రూ.2.3 లక్షల కోట్లు, వివిధ కేంద్ర పథకాల కింద నేరుగా రూ.6.2 లక్షల కోట్లు అందించామని, ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) కోసం రూ.26,000 కోట్లు, కొత్త రైల్వే లైన్లు మరియు స్టేషన్ల ఆధునికేకరణ కోసం రూ.31,221 కోట్లు వెచ్చించామని లెక్కలు వివరించారు. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన అంతా కేంద్ర నిధులతోనే జరుగుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ నిధులను తమ సొంత ఖాతాలో వేసుకుంటూ కేంద్రం ఏమీ ఇవ్వలేదంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

జాతీయ భద్రత, ఉగ్రవాద నిర్మూలన విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ బుజ్జగింపు ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల దేశ భద్రత ప్రమాదంలో పడిందని, వారు పాకిస్థాన్‌తో చేతులు కలిపి ఉగ్రవాదులను పరోక్షంగా ప్రేరేపించారని ఆరోపించారు. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ‘ఆపరేషన్ సింధూర్’ వంటి సంచలన సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా సమూలంగా తుడిచిపెట్టేశారని గర్వంగా చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ స్ఫూర్తిని అత్యున్నతంగా కాపాడుకుంటూ వస్తోంది కేవలం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి పరుగులు పెడుతుందని, ఖమ్మం గడ్డపై కాషాయ జెండా ఎగరేస్తే కేంద్రం నుండి ప్రత్యేకంగా వేల కోట్ల నిధులు తెచ్చి జిల్లా రూపురేఖలు మారుస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని భరోసా ఇస్తూ ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రతిష్టాత్మక మీడియా సమావేశంలో జిల్లా ప్రబరి మహిపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, సన్నీ ఉదయ ప్రతాప్,వాకధాని పుల్లారావు, నంబురి రామలింగేశ్వరరావు,
రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు, కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, గోంగూర వెంకటేశ్వర్లు, సారగుల అమరనాథ్, రుద్ర ప్రదీప్, మందడపు సుబ్బారావు, ఖమ్మం కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, సీనియర్ నాయకులు గంట్యాల విద్యాసాగర్, నున్న రవికుమార్, శీలం పాపారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, పమ్మీ అనిత, రజిని రెడ్డి, వీరవెల్లి రాజేష్, రవి గౌడ్, సురేష్ గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.