Mahaa Daily Exclusive

  ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమకు రాజధానిగా ఎదుగుతుంది.

Share

  • నందమూరి బాలకృష్ణ ఆశాభావం.

    అమరావతి, మహా.
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా మరియు చలనచిత్ర రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంపూర్ణ కట్టుబాటుతో ఉందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ , నాటక అభివృద్ధి సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, ఇండస్ట్రీ భవిష్యత్తు మరియు రాష్ట్రంలో సినీ వనరులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చలనచిత్ర రంగానికి పూర్వవైభవం తీసుకురావడానికి ఇదొక నూతన అధ్యాయమని ఆయన అభివర్ణించారు.

    ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. 1975లో ఉమ్మడి రాష్ట్రంలో చలనచిత్ర అభివృద్ధి సంస్థ ప్రారంభమైందని, రాష్ట్ర విభజన అనంతరం రాజధాని లేని క్లిష్ట పరిస్థితుల్లో 2017లో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌లతో కూడిన కూటమి ప్రభుత్వం టాలీవుడ్ పురోభివృద్ధికి ఎంతగానో శ్రమిస్తోందని అన్నారు. తెలుగు సినిమాలకు వచ్చే మొత్తం వసూళ్లలో దాదాపు 70 శాతం మేర ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచే లభిస్తోందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే పరిశ్రమను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

    రాష్ట్రంలో షూటింగ్‌లకు అద్భుతమైన, సహజసిద్ధమైన లొకేషన్లు ఉన్నాయని, తాను నటించిన ‘అఖండ’ సినిమా షూటింగ్‌ను రంపచోడవరంలో అద్భుతంగా నిర్వహించామని బాలకృష్ణ గుర్తుచేశారు. “ఆంధ్రప్రదేశ్‌లోని విభిన్న ప్రాంతాల్లో నేను చేసినన్ని సినిమాలు బహుశా మరెవ్వరూ చేసి ఉండరు” అని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో సినీ నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, షూటింగ్‌లకు అవసరమైన అన్ని రకాల అనుమతులు ఒకే చోట లభించేలా ‘సింగిల్ విండో’ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.

    ప్రస్తుత సినిమా రంగ పరిస్థితులపై ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సాంకేతికత తక్కువగా ఉన్నా సినిమాలు వేగంగా పూర్తయ్యేవని, కానీ నేడు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ నిర్మాణంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని అన్నారు. షూటింగ్‌ల సంఖ్య తగ్గిపోవడం వల్ల చిత్ర పరిశ్రమపై ఆధారపడిన ఎన్నో యూనియన్లు, కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, థియేటర్ల యజమానులు, పంపిణీదారులు సైతం నష్టాలతో తలుపులు మూసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సినిమా ఎలా తీయాలనే ఆలోచన దాటి, పరిశ్రమను ఎలా బతికించుకోవాలనే స్థితికి చేరుకున్నామని చెప్పారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఎక్కువ సంఖ్యలో సినిమాలు నిర్మించి థియేటర్లకు అందించాలని, చిత్రసీమను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరుతున్నామని బాలకృష్ణ పిలుపునిచ్చారు.