- ముత్యపుచిప్పల సేకరణకు వెళ్లి ఎనిమిది మంది మృతి.
- ఇద్దరు సురక్షితం.. ముమ్మరంగా గాలింపు చర్యలు.
శిరాలి (కర్ణాటక),మహా.ఆ జీవనధారే వారి పాలిట కాలయముడైంది. నిత్యం ఉపాధినిచ్చే ఆ నదీ గర్భమే ఊహించని రీతిలో వారిని మింగేసింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అత్యంత ఘోరమైన, హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నదిలో ముత్యపుచిప్పల సేకరణ కోసం వెళ్లిన ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మంది అకస్మాత్తుగా పెరిగిన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఏడుగురు మహిళలే కావడం ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు నీటిలో గల్లంతవగా.. ఇద్దరిని స్థానికులు సమయస్ఫూర్తితో రక్షించారు.
ఒకరిని కాపాడబోయి.. అందరూ జలసమాధి.
పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కన్నడ జిల్లా షిరాలి గ్రామానికి చెందిన కొందరు మత్స్యకార కుటుంబీకులు రోజూలాగే నదిలోకి దిగి ముత్యపుచిప్పలను సేకరిస్తున్నారు. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం, ప్రవాహ ఉధృతి క్షణాల వ్యవధిలో అకస్మాత్తుగా పెరిగిపోయాయి. నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో మొదట ఒకరిద్దరు బలమైన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. నదిలో మునిగిపోతూ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న వారిని రక్షించే క్రమంలో.. మిగిలిన వారు కూడా ఒకరి వెనుక ఒకరు నదిలోకి దూకారు. అయితే ప్రవాహ వేగం ఊహించని స్థాయిలో ఉండటంతో కాపాడటానికి వెళ్లిన వారు సైతం నీటి సుడిగుండంలో చిక్కుకుని ఒక్కొక్కరుగా జలసమాధి అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నది నుంచి ఇప్పటివరకు ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీశారు.
మృతుల్లో ఉమేష్ మంజునాథ్ నాయక్ (40) అనే ఏకైక పురుషుడితో పాటు లక్ష్మీ మహాదేవ్ నాయక్ (42), లక్ష్మి జుట్టప్ప నాయక్ (30), లక్ష్మీ అప్పన్న నాయక్ (60), లక్ష్మి శివరామ్ నాయక్ (49), జ్యోతి మస్తమ్మ నాయక్ (34), మాల్తి నాయక్ (38), మాస్టమ్మ నాయక్ (60) ఉన్నారు.
ఇద్దరు సురక్షితం.. ముమ్మరంగా గాలింపు చర్యలు
ఈ జలప్రళయం నుంచి నాగరాత్న, మహాదేవి అనే ఇద్దరు మహిళలను స్థానికులు చాకచక్యంగా రక్షించగా, ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇంకా ఆచూకీ లభించని మరో ఇద్దరి కోసం పోలీసులు, రాష్ట్ర విపత్తు సహాయక బృందాలు , స్థానిక మత్స్యకారులు నదిలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మృతులలో చాలామందికి ఇదివరకు నదిలోకి వెళ్లి ముత్యపుచిప్పలు సేకరించిన సుదీర్ఘ అనుభవం ఉందని, కానీ వర్షం కారణంగా నీటిమట్టం క్షణాల్లో పెరిగిపోవడాన్ని వారు ఊహించలేకపోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ప్రధాని మోడీ, సీఎం సిద్ధరామయ్య తీవ్ర విచారం.. భారీ పరిహారం ప్రకటన
ఈ దారుణ ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇదొక అత్యంత బాధాకరమైన విషయమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్-గ్రేషియాను పీఎంఓ ద్వారా ప్రకటించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక సైతం ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఒక్కసారిగా గ్రామానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందడంతో షిరాలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.







