Mahaa Daily Exclusive

  భయపడొద్దు.

Share

  •  అందరి హక్కుల కోసం నిలబడదాం.
  •  కాంగ్రెస్ మైనారిటీ సమావేశంలో రాహుల్ గాంధీ దిశా నిర్దేశం.

    ఢిల్లీ, మహా.

    దేశంలో అన్యాయాన్ని ఎదుర్కొంటున్న ఏ సామాజిక వర్గానికైనా బహిరంగంగా మద్దతుగా నిలవడానికి కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనుకాడబోదని, ఈ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఎఐసిసి మైనారిటీ విభాగం సలహా కమిటీ అంతర్గత సమావేశంలో ఆయన పాల్గొని, పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసంతృప్తి, అంతర్జాతీయ పరిణామాలు ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, రాబోయే ఏడాది కాలంలోనే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోక తప్పదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ‘మైనారిటీ’ కాదు.. నేరుగా ‘ముస్లిం’ అనే మాట్లాడండి

    ఈ అంతర్గత సమావేశంలో కొంతమంది సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. బహిరంగ వేదికలపై లేదా చర్చల్లో “ముస్లిం” అనే పదానికి బదులుగా కాస్త సున్నితంగా ఉండే “మైనారిటీ” అనే పదాన్ని ఉపయోగిస్తే బాగుంటుందని రాహుల్ గాంధీకి సూచించారు. అయితే, ఈ ప్రతిపాదనతో రాహుల్ గాంధీ పూర్తిగా విభేదించారు. “మనం దేనికి భయపడాలి? సమాజంలో అన్యాయానికి గురవుతున్న ఏ వర్గానికైనా అండగా నిలబడటం కాంగ్రెస్ నైజం. హిందువులు, దళితులు, అగ్రవర్ణాలు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు.. ఇలా ఎవరైనా సరే, వారి హక్కుల కోసం కాంగ్రెస్ ఎప్పుడూ గళం విప్పుతూనే ఉంటుంది” అని రాహుల్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మైనారిటీల సమస్యలపై మాట్లాడేందుకు కొందరు సీనియర్ నేతలు వెనుకంజ వేస్తున్నారన్న అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా తోసిపుచ్చారు.

    ఓటు బ్యాంక్ రాజకీయం వద్దు: ఇమ్రాన్ మసూద్

    ఈ సమావేశంలో పాలుపంచుకున్న కాంగ్రెస్ కీలక నేత ఇమ్రాన్ మసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు కేవలం బీజేపీని ఓడించడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారనే పాత భావజాలాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మైనారిటీల సంక్షేమం మరియు ముస్లిం సమాజం కోసం కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన, ప్రస్తుతం చేస్తున్న సానుకూల పనులను నిరంతరం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ విధమైన నిర్మాణాత్మక విధానం ద్వారానే పార్టీకి మైనారిటీల్లో శాశ్వత నమ్మకం, మద్దతు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.