Mahaa Daily Exclusive

  సినిమా సునామీ..

Share

  •  ఏ క్షణమైనా కూలిపోవచ్చు.
  •  సీఎం విజయ్ ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు.

    చెన్నై,మహా.

    తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన నటుడు, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ప్రభుత్వంపై ప్రతిపక్ష ద్రవిడ మున్నేట్ర కజగం అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తొలిసారిగా అత్యంత ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సాధించిన విజయం ఎంతమాత్రం రాజకీయ సునామీ కాదని, అదొక కేవలం ‘సినిమా సునామీ’ మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. కొత్త బొమ్మను చూసి పిల్లలు మురిసిపోయినట్లుగా, తమ అభిమాన నటుడు కొత్త పార్టీ పెట్టాడన్న ఒకే ఒక్క ఉత్సాహంతోనే ప్రజలు ఆయనకు ఓటేశారని, కానీ కొద్దిరోజుల్లోనే ఆ ఉత్సాహం నీరుగారి ప్రజలు మళ్లీ తమ కన్నతల్లి లాంటి డీఎంకే వైపునకు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

    చెన్నైలో జరిగిన పార్టీ అంతర్గత కీలక సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రస్తుత విజయ్ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని ఏమాత్రం పూర్తి చేయలేదని జోస్యం చెప్పారు. మెజారిటీ సాధించడానికి అవసరమైన 118 సీట్లను ఒంటరిగా గెలుచుకోలేక, కేవలం 108 స్థానాలకే పరిమితమైన టీవీకే.. ఇతర పార్టీల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉందన్నారు. “ఈ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోయే ఒక ‘గోడ మీద పిల్లి’ లాంటిది. డీఎంకే బలహీనపడలేదు, మా అండతోనే ఈ కూటమి ప్రభుత్వం నడుస్తోంది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే ను విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలని టీవీకే శాయశక్తులా ప్రయత్నించి పూర్తిగా విఫలమైందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు వరకు విజయ్ ప్రభుత్వానికి కేవలం బయటి నుంచే మద్దతు ఇస్తామని ప్రకటించిన కమ్యూనిస్టులు , విసికె , ఐయుఎంఎల్ లు తీరా ఫలితాలు వచ్చాక మాట మార్చి క్యాబినెట్‌లో భాగస్వామ్యులయ్యారని, అందుకు వారికి నా ప్రత్యేక అభినందనలంటూ స్టాలిన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

    కాంగ్రెస్ ఒక వెన్నుపోటు దారు.. తీవ్రస్థాయిలో మండిపడిన ఉదయనిధి స్టాలిన్

    మరోవైపు స్టాలిన్ తనయుడు, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ సైతం ఇదే వేదికపై సుదీర్ఘ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీపై మునుపెన్నడూ లేని రీతిలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ నిరంతరం విజయాలు సాధిస్తూ ఎదుగుతుండటానికి నరేంద్ర మోడీ, అమిత్ షాల వ్యూహాలు కారణమని తాను ఇన్నాళ్లూ భావించానని, కానీ అసలు కారణం కాంగ్రెస్ పార్టీ చేతగానితనమేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి కనీస రాజకీయ మర్యాద గానీ, కృతజ్ఞతా భావం గానీ లేవని, అలాంటి నమ్మకద్రోహ పార్టీని భవిష్యత్తులో ఎన్నటికీ నమ్మకూడదని, తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

    గత 20 ఏళ్లుగా కాంగ్రెస్‌ను డీఎంకే తన భుజాలపై మోసిందని, తమిళనాడులో సెక్యులరిజం కాపాడటం కోసం, బీజేపీని అడ్డుకోవడం కోసం మా కార్యకర్తలు రక్తం, చెమట చిందించి కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కష్టపడ్డారని ఉదయనిధి గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో కూడా క్షేత్రస్థాయిలో ఉనికి లేని కాంగ్రెస్.. డీఎంకే శ్రేణుల కష్టం వల్లే 5 స్థానాల్లో గెలిచిందని, తీరా గెలిచాక కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా, కేవలం అధికారం కోసం డీఎంకే కూటమి నుంచి తప్పుకుని విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో చేరిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ఈ చారిత్రాత్మక వెన్నుపోటును తమిళనాడు ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని ఉదయనిధి హెచ్చరించారు. సుదీర్ఘకాలం కలిసి నడిచిన డీఎంకే – కాంగ్రెస్ బంధం ఈ విమర్శలతో పూర్తిగా బీటలు వారినట్లయింది.