- ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఖాతా నిలిపివేతపై పినరయి విజయన్ మండిపాటు.
తిరువనంతపురం,మహా.
దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్న పొలిటికల్ వ్యంగ్య ప్లాట్‌ఫామ్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అధికారిక ఎక్స్ ఖాతాను భారతదేశంలో నిలిపివేయడం (విత్‌హెల్డ్) పట్ల కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, సీనియర్ సీపీఎం నాయకుడు పినరయి విజయన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ‘అసహనం’, ‘భయం’ ఈ చర్య ద్వారా స్పష్టంగా బహిర్గతమైందని ఆయన శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. యువత నడుపుతున్న ఒక డిజిటల్ ఉద్యమం ఎక్కడ తమ ప్రభుత్వ ఉనికికే ముప్పుగా మారుతుందోననే ఆందోళనతోనే కేంద్రం ఇలాంటి అప్రజాస్వామిక నిర్ణయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
బీజేపీ అధికారిక ప్రచారం కంటే వేగంగా దూసుకెళ్లింది
ఈ సందర్భంగా పినరయి విజయన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ స్థాయిలో ఒక సామాజిక మాధ్యమ ఖాతాను చూసి భయపడుతోందని ప్రశ్నించారు. కోట్ల రూపాయల వ్యయంతో నడిచే బీజేపీ అధికారిక ప్రచార యంత్రాంగం కంటే అత్యంత వేగంగా ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేజీ ప్రజల్లోకి, ముఖ్యంగా యువతలోకి దూసుకెళ్లి ప్రజాదరణ పొందిందని ఆయన గుర్తుచేశారు. దేశంలో తీవ్రమవుతున్న నిరుద్యోగం, నిర్లక్ష్యం, ఆర్థిక అసమానతలతో సతమతమవుతున్న యువత.. ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులపై ఉన్న తీవ్ర అసంతృప్తి వల్లే ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ వైపు ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు.
“యువతను ఉద్దేశించి చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్యకు (కాక్రోచెస్) ప్రతిచర్యగా మాత్రమే దీనిని చూడలేం. నిరుద్యోగం, దోపిడీ, అసమానతలతో కూడిన ప్రస్తుత వ్యవస్థపై యువతలో పేరుకుపోయిన బలమైన రాజకీయ ఆగ్రహానికి ఇది ప్రతీక. ఈ నిరసన జ్వాల దేశమంతటా వ్యాపిస్తుందనే తీవ్ర భయమే.. కేంద్ర ప్రభుత్వాన్ని చట్టాలు, పరిపాలనా యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య గొంతుకలను నొక్కేసేలా చేస్తోంది” అని విజయన్ ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ యువత చేస్తున్న నిరసనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని, స్వేచ్ఛను కాంక్షించే శక్తులన్నీ దీనిని తీవ్రంగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశాన్ని అస్థిరపరిచే కుట్ర: తిప్పికొట్టిన కేరళ బీజేపీ
మరోవైపు పినరయి విజయన్ విమర్శలను కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ తీవ్రంగా తిప్పికొట్టారు. ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వెనుక సరిహద్దుల అవతల నుంచి దేశాన్ని అస్థిరపరిచేందుకు జరుగుతున్న ఒక పెద్ద ‘ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్’ (ప్రభావ కుట్ర) దాగి ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కృత్రిమ మేధ ,బోట్స్ సాంకేతికతను ఆయుధంగా మలుచుకుని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, దేశ ప్రగతిని అడ్డుకునేందుకు విదేశీ శక్తులతో కలిసి దేశీయ విపక్షాలు ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపాయని విమర్శించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా వికసిత భారత్ నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
కేరళలో సిజెపికి పెరుగుతున్న పొలిటికల్ సపోర్ట్
ఇదిలావుండగా, ఈ డిజిటల్ వివాదం కేరళ రాజకీయాల్లో సరికొత్త రంగు పులుముకుంది. పార్టీల బేధాల్ని పక్కనబెట్టి అటు అధికార, ఇటు ప్రతిపక్షాలకు చెందిన యువ నాయకులు, ఎమ్మెల్యేలు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కి మద్దతుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన నూతన ఎమ్మెల్యే అబిన్ వర్కీ, ఐయూఎంఎల్ నేతలు పి.కె.నవాస్, టి.పి.అష్రఫాలీలతో పాటు సీపీఎంకు చెందిన వి.కె.సనోజ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శివప్రసాద్ వంటి యువ నేతలు ఈ అకౌంట్ నిలిపివేతను తీవ్రంగా తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాగా, గురువారం ఈ అకౌంట్ బ్లాక్ అయిన కొద్దిసేపటికే.. ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ (కరోచెస్ డోంట్ డై) అనే సరికొత్త ట్యాగ్‌లైన్‌తో మరో హ్యాండిల్ ప్రత్యక్షమై నెట్టింట హల్చల్ చేస్తోంది.







