Mahaa Daily Exclusive

  చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు….

Share

చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు.
* మహానాడు వేదికగా లోకేశ్ సంచలన ప్రకటన.
*ఆన్‌లైన్ అయినా, హైబ్రిడ్ అయినా ‘టీమ్ 11’కి బ్యాటింగ్ తప్పదు.
*టీడీపీ జెండాను ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించిన ముఖ్యమంత్రి.
* వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలి ప్రసంగంలో అదరగొట్టిన నారా లోకేశ్.
* సంక్షేమానికి ఆద్యుడు, ట్రెండ్ సెట్టర్ అన్న ఎన్టీఆర్: ఘన నివాళి.
అమరావతి , మహా.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక పండుగ ‘మహానాడు’ వేడుకలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు సాగనున్న ఈ పసుపు జాతరను ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. పార్టీ పసుపు పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం.. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్, పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల సభ్యులతో కలిసి పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉదయం 10:10 గంటలకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభోపన్యాసంతో ఈ కార్యక్రమాలు అధికారికంగా మొదలయ్యాయి. ఈ రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో ఏపీ, తెలంగాణకు చెందిన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.
**మోడల్ మారింది.. విధానం కాదు: చంద్రబాబు**
ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలను ఒక ‘యుద్ధం’గా అభివర్ణించిన ఆయన.. ఆ పరిస్థితుల వల్లే ఈసారి మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి నెల్లూరులో భారీ ఎత్తున ఈ వేడుకలు నిర్వహించాలని భావించినప్పటికీ.. అనివార్య కారణాలతో ఈ విధానాన్ని ఎంచుకున్నామన్నారు. అయితే, సమావేశం మోడల్ మారిందే తప్ప మహానాడు విధానం, స్ఫూర్తి ఏమాత్రం మారలేదని స్పష్టం చేశారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగానే ఈ కార్యక్రమం కొనసాగుతుందని, కార్యకర్తలు ఏమాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. జై తెలుగుదేశం నినాదాలతో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.
**లోకేశ్ సంచలన ప్రకటన.. ప్రాంగణంలో హర్షాతిరేకాలు**
ఈ ఏడాది మహానాడులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ప్రసంగమే. నూతన హోదాలో తొలిసారిగా సభాముఖంగా మాట్లాడిన ఆయన.. సంచలన ప్రకటనతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఉదయం నుంచే సామాజిక మాధ్యమం (ఎక్స్) వేదికగా తాను చేయబోయే ‘భారీ ప్రకటన’పై నెలకొన్న ఉత్కంఠకు ఆయన మధ్యాహ్నం 12 గంటలకు తెరదించారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా.. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయిస్తామని లోకేశ్ చారిత్రక ప్రకటన చేశారు. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజంలో నిజమైన అభివృద్ధి సాధ్యమని నమ్మిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆయన ఉద్ఘాటించారు. యువతకు, మహిళలకు పార్టీలో పెద్దపీట వేయడం ద్వారా భవిష్యత్తు కోసం సరికొత్త నాయకత్వాన్ని తయారు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో మహానాడు ప్రాంగణం హర్షాతిరేకాలతో మార్మోగింది.
**’టీమ్ 11’కి బ్యాటింగ్ తప్పదు!**
తమ ప్రసంగంలో ప్రత్యర్థి పార్టీపై లోకేశ్ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని ప్రకటించగానే.. ప్రతిపక్షంలో ఉన్న ‘టీమ్ 11’ సంబరాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. మహానాడు ఆఫ్‌లైన్‌లో జరిగినా, ఆన్‌లైన్‌లో జరిగినా లేదా హైబ్రిడ్ మోడల్‌లో జరిగినా.. ఆ టీమ్ 11కి మాత్రం తమ నుంచి బ్యాటింగ్ తప్పదని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి ‘నేను తెలుగు వాడిని.. నాది తెలుగుదేశం పార్టీ’ అని గర్వంగా చెప్పుకునే వేదిక ఈ మహానాడు అని అభివర్ణించారు. ‘నేషన్ ఫస్ట్’ (దేశమే ముందు) అనేది టీడీపీ విధానమని, ప్రధాని మోదీ సూచించిన మార్గంలోనే తాము నడుస్తున్నామని లోకేశ్ వివరించారు.
**సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్.. ఆయనో లెజెండ్**
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అన్న ఎన్టీఆర్‌ను లోకేశ్ ఈ సందర్భంగా ఘనంగా కీర్తించారు. దేశ రాజకీయాలకు, సినిమాలకు ఎన్టీఆర్ ఒక లెజెండ్ అని.. తెలుగువారి ఆత్మగౌరవానికి, పౌరుషానికి ఆయన ప్రతిరూపమని అభివర్ణించారు. ఆయన ట్రెండ్ ఫాలో అయ్యే వ్యక్తి కాదని, ట్రెండ్ సెట్ చేసిన మహనీయుడని కొనియాడారు. దేశానికి సంక్షేమాన్ని, అభివృద్ధిని పరిచయం చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని గుర్తుచేశారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, పెన్షన్లు, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజన పథకం, పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఆయనకే సాధ్యమయ్యాయన్నారు. ముఖ్యంగా స్త్రీశక్తిని గుర్తించి ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించడంతో పాటు, పద్మావతి విశ్వవిద్యాలయం ఏర్పాటు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఆద్యుడు ఎన్టీఆర్ అని లోకేశ్ ప్రశంసించారు. ఆయన నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టడం ఎవరి వల్లా సాధ్యం కాదని ఆయన ఉద్ఘాటించారు.