* కర్ణాటకలో ముదిరిన నాయకత్వ సెగ.
* రేపు అన్ని విషయాలు చెప్తా.
* ఉత్కంఠ పెంచిన ముఖ్యమంత్రి వ్యాఖ్యలు.
*గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు ప్రచారం.
* డీకే శివకుమార్ వైపు మొగ్గుతున్న ఎమ్మెల్యేలు.
* సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా ఖాయమంటున్న బీజేపీ.
బెంగళూరు,మహా.
కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సాగుతున్న నాయకత్వ మార్పు ఊహాగానాలు ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరాయి. కాంగ్రెస్ అధిష్ఠానంతో అత్యవసర భేటీ కోసం ఢిల్లీ వెళ్లి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. దేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మార్పుపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా.. “తర్వాత మాట్లాడతా.. అన్ని విషయాలు రేపు వివరంగా చెబుతా” అంటూ దాటవేయడం విశేషం. దీంతో ఆయన పదవి నుంచి తప్పుకోవడం ఖాయమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
**గవర్నర్ భేటీ, అల్పాహార విందుపై ఆసక్తి**
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (రేపు) గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్డీ తమ్మయ్య వెల్లడించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. మరోవైపు, సిద్ధరామయ్య ఒక బలమైన ప్రజా నాయకుడని, రేపు ఉదయం ముఖ్యమంత్రి ఇచ్చే అల్పాహార విందు సమావేశం తర్వాతే ఈ నాయకత్వ అంశంపై పూర్తి స్పష్టత వస్తుందని మంత్రి కేహెచ్ మునియప్ప అభిప్రాయపడ్డారు. అయితే, పార్టీలోనే అప్పుడే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను తక్షణమే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలన్న తన డిమాండ్‌కు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ బహిరంగంగానే స్పష్టం చేయడం పార్టీలో అంతర్గత ప్రకంపనలను సూచిస్తోంది.
**సిద్ధరామయ్య దిగిపోవడం ఖాయం: బీజేపీ**
రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఈ చరవేగ పరిణామాలపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని స్వయంగా ఆ పార్టీ అధిష్ఠానమే అంగీకరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు. సిద్ధరామయ్య గురువారం లేదా శుక్రవారంలోగా తన పదవికి రాజీనామా చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. సిద్ధరామయ్య ఐదేళ్ల హయాంలో రాష్ట్రం తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. కర్ణాటక కాంగ్రెస్ వర్గాల్లో ఇంతటి తీవ్రమైన ఉత్కంఠ, చర్చ నడుస్తున్నప్పటికీ.. అటు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం నాయకత్వ మార్పు అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించడం గమనార్హం.








