Mahaa Daily Exclusive

  ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ చట్టబద్ధం…..

Share

ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ చట్టబద్ధం.
*ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు.
*మే 30 నుంచి ఆఖరి విడత ప్రక్రియకు లైన్ క్లియర్.
*విపక్షాల అభ్యంతరాలకు బ్రేక్ వేసిన అత్యున్నత న్యాయస్థానం తీర్పు.
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు సుప్రీంకోర్టులో చట్టబద్ధత లభించింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక సవరణ విధానం పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని అత్యున్నత న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పునిచ్చింది. కేవలం సాధారణ సవరణ విధానానికి భిన్నంగా ఉందనే ఒకే ఒక్క కారణాన్ని చూపుతూ ఈ ప్రత్యేక ప్రక్రియను రద్దు చేయడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. మే 30వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మూడో విడత ఓటరు సవరణ ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో సుప్రీంకోర్టు నుంచి ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
**ఈసీ అధికారాలపై సుప్రీంకోర్టు ముద్ర**
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326తో పాటు 1950 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓటరు జాబితాలను పారదర్శకంగా రూపొందించేందుకు ఈ తరహా ప్రత్యేక సవరణలు చేపట్టే సంపూర్ణ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాల్లోని లోపాలను సవరించి పారదర్శకతను మరింత పెంచవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇది రాజ్యాంగం నిర్దేశించిన ఉచిత, పక్షపాతరహిత ఎన్నికల నిర్వహణ లక్ష్యానికి లోబడే ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
**చట్టాల పరిధిలోనే ఓటరు వెరిఫికేషన్**
ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న ఎన్నికల చట్టాలను ఎక్కడా అతిక్రమించడం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(3) కల్పించిన పరిధిలోనే ఎన్నికల సంఘం తన విధులను నిర్వర్తించిందని, అందువల్ల అధికారులు తమ పరిమితులను దాటి ప్రవర్తించారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. దేశంలో తొలుత బిహార్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ ఓటరు వెరిఫికేషన్ విధానాన్ని, ఆ తర్వాత వచ్చిన ఫలితాల ఆధారంగా ఎన్నికల సంఘం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరింపజేసింది.
**వివాదాలకు బ్రేక్.. మే 30 నుంచి తుది విడత**
గత కొన్ని నెలలుగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రతిపక్ష పార్టీలకు మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ ప్రత్యేక సవరణల సాకుతో అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాల నుంచి అక్రమంగా తొలగిస్తున్నారంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అయితే, తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఈ సుదీర్ఘ వివాదానికి పూర్తిగా తెరపడినట్లయింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మే 30వ తేదీ నుంచి దేశంలోని 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో చివరి విడత ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా యథావిధిగా సాగనుంది.