Mahaa Daily Exclusive

  వాటా విక్రయం వార్తలతో వణుకు….

Share

వాటా విక్రయం వార్తలతో వణుకు.
* 4 శాతం పతనమైన ఎల్ఐసీ షేరు.
* ఇంట్రాడేలో రూ.818.85 కనిష్ఠాన్ని తాకిన స్టాక్.
* ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు.
* కేంద్రం మరో 2 శాతం వాటా వదలించుకోనుందనే ప్రచారంతోనే విక్రయాల ఒత్తిడి.
*ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లతో ‘దీపమ్‌’ సంప్రదింపులు.
* 2032 లోపు నిబంధనల అమలుకు కసరత్తు.
ముంబై,మహా.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగుతున్న తరుణంలో, ప్రభుత్వ రంగ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) షేర్లు బుధవారం భారీ పతనాన్ని చవిచూశాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఎల్ఐసీలో తనకున్న వాటాను మరింతగా విక్రయించనుందనే వార్తలు దలాల్ స్ట్రీట్‌లో హల్‌చల్ చేయడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ ప్రచారంతో ఏర్పడిన తీవ్ర ఒత్తిడి కారణంగా ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఎల్ఐసీ షేరు ఏకంగా 4 శాతానికి పైగా కుప్పకూలింది. దీంతో ఈ షేర్లను నమ్ముకున్న ఇన్వెస్టర్లు ఒక్కరోజే భారీగా నష్టపోవాల్సి వచ్చింది.
బుధవారం నాటి ట్రేడింగ్ ఆరంభంలో ఎల్ఐసీ షేరు స్వల్ప లాభాలతోనే మొదలైనప్పటికీ, మార్కెట్ నడుస్తున్న కొద్దీ అమ్మకాల హోరు పెరిగింది. కిందటి సెషన్‌లో రూ.854.90 వద్ద ముగిసిన ఎల్ఐసీ షేరు, బుధవారం ట్రేడింగ్‌లో ఒక దశలో రూ.818.85 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకుని 3.50 శాతం నష్టంతో రూ.825 వద్ద స్థిరపడింది. ఈ పతనంతో సంస్థ మొత్తం మార్కెట్ విలువ రూ.5.22 లక్షల కోట్లకు పరిమితమైంది. కాగా, ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ.980 గానూ, కనిష్ఠ ధర రూ.721.50 గానూ రికార్డయ్యింది.
**బ్యాంకర్లతో ముమ్మర సంప్రదింపులు**
రానున్న జూన్ చివరి వారంలో లేదా జులై నెలలో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో సుమారు 2 శాతం మేర వాటాను విక్రయించేందుకు సిద్ధమవుతోందన్న వార్తలే ఈ భారీ పతనానికి మూలకారణంగా నిలిచాయి. ఈ వాటా విక్రయ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్’ ఇప్పటికే అంతర్జాతీయ, దేశీయ ప్రసిద్ధ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లతో ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, బీఎన్‌పీ పారిబస్ ఎస్ఏ, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలతో చర్చలు తుది దశకు చేరినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
**సెబీ నిబంధనల కోసమే..**
కేంద్ర ప్రభుత్వం గతంలో 2022 మే నెలలో ఎల్ఐసీ మెగా ఐపీఓ ద్వారా మొదటిసారి 3.5 శాతం వాటాను విక్రయించి మార్కెట్ నుంచి రూ.21 వేల కోట్ల నిధులను సమీకరించింది. ఆ సమయంలో ఒక్కో షేరు ధరను రూ.949 గా నిర్ణయించారు. ఆ తర్వాత ఎల్ఐసీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయింది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. అయితే, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. లిస్టెడ్ కంపెనీల్లో కనీసం 25 శాతం వాటా సాధారణ పబ్లిక్ షేర్ హోల్డింగ్ రూపంలో ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఎల్ఐసీకి ఈ నిబంధనను పూర్తిగా అమలు చేయడానికి సెబీ 2032 వరకు సుదీర్ఘ గడువు ఇచ్చింది. ఈ గడువు లోపుగా ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించాల్సి ఉన్నందున.. కేంద్రం క్రమక్రమంగా తన వాటాలను విక్రయిస్తూ వస్తోంది.
**వరుసగా ప్రభుత్వ సంస్థల్లో వాటాల ఉపసంహరణ**
కేంద్ర ప్రభుత్వం కేవలం ఎల్ఐసీలోనే కాకుండా గత కొంతకాలంగా వరుసగా పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో (పిఎస్‌యు) పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేసింది. గతంలో ఐడీబీఐ బ్యాంకుతో ప్రారంభించి ఆ తర్వాత భెల్ ఐఆర్ఎఫ్‌సీ సంస్థల్లో కూడా వాటాలను విక్రయించింది. ఇటీవలే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న 8 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతి ద్వారా విజయవంతంగా ఉపసంహరించుకుంది. ప్రస్తుతం కోల్ ఇండియాలోనూ వాటా విక్రయం సాగుతుండగా.. దీని తర్వాత తదుపరి వంతు ఎల్ఐసీదేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎల్ఐసీ స్టాక్ తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది.