వడ్లు కొనకుండా రైతులను అరిగోస పెడుతున్నారు.
* కొనుగోలుపై క్లారిటీ ఇవ్వండి.
* వ్యవసాయం చేయాలంటేనే భయపడే దుస్థితి వచ్చింది.
* వడ్ల పైసలన్నీ కేంద్రమే ఇస్తుంటే.. కొనుగోలు చేయడానికి మీకేం ఇబ్బంది?.
* కరీంనగర్ బొమ్మకల్ ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.
కరీంనగర్, మహా.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్లే నేడు ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని, నెల రోజులుగా మొత్తుకుంటున్నా వడ్లు కొనకుండా రైతులను అరిగోస పెడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్లతో కలిసి ఆయన బుధవారం మండల పరిధిలోని బొమ్మకల్ ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో వడ్ల కుప్పలపై దీనంగా ఎదురుచూస్తున్న రైతులను కలిసి, వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసి, మొలకలొచ్చిన ధాన్యాన్ని చూపిస్తూ రైతులు మంత్రి ఎదుట వాపోయారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల మధ్య అస్సలు సమన్వయమే లేదని, తలో మాట చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని మండిపడ్డారు.
**తడిసిన ధాన్యం సాకుతో దోపిడీ**
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం పేరుతో పెద్ద ఎత్తున తరుగు, కోతలు విధిస్తూ రైతులను దారుణంగా దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే కనీసం పరిహారమిచ్చే దిక్కు కూడా ఈ ప్రభుత్వంలో లేదని విమర్శించారు. కంటికి రెప్పలా కాపాడి పండించిన వడ్లను కూడా సకాలంలో కొనకపోతే.. ఇక రైతులకు ఈ ప్రభుత్వం ఇంకేం మేలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. వడ్ల కొనుగోళ్లకు సంబంధించి ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంటే.. వాటిని సేకరించి మిల్లులకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీశారు. రాబోయే నెలాఖరు వరకు వడ్ల కొనుగోలు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పూర్తి చేస్తే.. తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. అసలు రాష్ట్రంలో వడ్లను కొంటారా? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని, ఒకవేళ కొనుగోళ్లు చేయడం చేతగాకపోతే అదే విషయాన్ని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
**బాల్క సుమన్ వ్యాఖ్యలు దుర్మార్గం**
ఇదే సమయంలో బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. బాల్క సుమన్ చేసిన విధ్వంసకర వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవని మండిపడ్డారు. సమాజంలో విధ్వంసం సృష్టించడం ద్వారా సాధించేది ఏమీ ఉండదని, కేవలం అల్లర్లు సృష్టించి డబ్బులు వసూలు చేయాలన్నదే బీఆర్ఎస్ అసలు ధ్యేయమని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అస్సలు పట్టించుకోవడం లేదని, ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఉనికి కోల్పోతోందనడానికి బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలే సజీవ నిదర్శనమని బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.








