Mahaa Daily Exclusive

  చెరువు శిఖాన్ని ఆక్రమించిన మైహోమ్ సంస్థ….

Share

చెరువు శిఖాన్ని ఆక్రమించిన మైహోమ్ సంస్థ.
* రూ.1,800 కోట్ల భూమిని కాపాడిన ‘హైడ్రా’.
*మాదాపూర్ ఐటీ కారిడార్‌లో ఈదులకుంటను మాయం చేసేందుకు కుట్ర.
* వరద కాలువను డైవర్ట్ చేసి.. రూపురేఖలు మార్చేసి స్కైస్క్రాపర్స్ నిర్మాణానికి స్కెచ్.
* శాటిలైట్ చిత్రాలు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా కంచె వేసిన అధికారులు.
హైదరాబాద్,మహా.
మహానగరంలోని ఐటీ కారిడార్ పరిధిలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ, చెరువు భూములను మింగేయాలని చూస్తున్న కబ్జారాయుళ్లకు, బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు ‘హైడ్రా’ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. మాదాపూర్ పరిధిలో అత్యంత ఖరీదైన మైహోమ్ రామేశ్వరరావు సంస్థకు చెందిన భూ ఆక్రమణలపై హైడ్రా అధికారులు పంజా విసిరారు. పక్కా ప్రణాళికతో చెరువు శిఖాన్ని (ఎఫ్‌టీఎల్) ఆక్రమించి, రూపురేఖలు మార్చేసి కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసిన వైనాన్ని బట్టబయలు చేస్తూ, మంగళవారం నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో ఆ భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
**మ్యాప్ నుంచే చెరువు మాయం!**
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామ సర్వే నంబరు 7లో గల 6.05 ఎకరాల విస్తీర్ణం కలిగిన ‘ఈదులకుంట’ చెరువును కబ్జాల చెర నుంచి విడిపించినట్లు హైడ్రా అధికారికంగా ప్రకటించింది. శిల్పారామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట చెరువు నిండితే.. ఆ వరద నీరంతా కాలువ ద్వారా సహజసిద్ధంగా ఈదులకుంటకు చేరేది. అయితే, సదరు నిర్మాణ సంస్థ కబ్జాదారులు పక్కా స్కెచ్‌తో ఆ వరద కాలువను వేరే రూట్‌లోకి మళ్లించి (డైవర్ట్ చేసి) చెరువుకు నీరు చేరకుండా ఎండిపోయేలా చేశారు. ఆ తర్వాత చెరువు రూపురేఖలను మార్చేసి, హద్దులు చెరిపేసి.. అక్కడ భారీ స్కైస్క్రాపర్స్ భవన నిర్మాణాలే ఆలస్యం అనుకున్న తరుణంలో స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. తమ్మిడికుంట – ఈదులకుంట – సున్నం చెరువులుగా గొలుసుకట్టుగా ఉన్న వ్యవస్థలో ఈదులకుంట మాయమవుతోందని ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)లో కూడా కేసు నమోదైంది.
**శాటిలైట్ చిత్రాల ఆధారంగా గుట్టు రట్టు**
స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించగా అక్కడ చెరువు ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. అనంతరం గ్రామ, రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. అక్కడ 6.05 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)కి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు కూడా పూసగుచ్చినట్లు నిర్ధారించాయి. దీంతో మంగళవారం హైడ్రా బలగాలు రంగంలోకి దిగి చెరువు పాత ఎఫ్‌టీఎల్ సరిహద్దులను (హద్దులు) ఖచ్చితంగా నిర్ధారించి, చుట్టూ రక్షణ ఫెన్సింగ్ (కంచె) వేశాయి.
**రూ.1,800 కోట్ల భూమికి విముక్తి**
ఈ ఆపరేషన్‌లో కేవలం 6.05 ఎకరాల ఈదులకుంట చెరువునే కాకుండా.. ఆ చెరువుకు ఆనుకుని ఉన్న సర్వే నంబరు 11/37లోని మరో 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం కబ్జారాయుళ్లు సర్వే నంబర్లు మార్చి దక్కించుకోవాలని చూడగా హైడ్రా ఆ కుట్రను భగ్నం చేసింది. ఈ రెండు స్థలాలను కలిపి మొత్తం 11.21 ఎకరాల విలువైన భూమిని ఆక్రమణల నుంచి కాపాడారు. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం కేవలం మాదాపూర్ ఐటీ కారిడార్‌లోని ఈ ఒక్క ప్రాంతంలోనే దాదాపు రూ.1,800 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను హైడ్రా స్వాధీనం చేసుకున్నట్లయింది. స్వాధీనం చేసుకున్న ఈ స్థలం చుట్టూ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టి, ఫెన్సింగ్ వేసే పనులను వేగవంతం చేశారు. ఎంతటి బడా సంస్థలైనా ప్రభుత్వ, చెరువు భూములను ఆక్రమిస్తే ఊపేక్షించే ప్రసక్తే లేదని ఈ ఆపరేషన్ ద్వారా అధికారులు స్పష్టం చేశారు.