Mahaa Daily Exclusive

  సరిహద్దుల్లో ‘అమిత్’ ఉక్కుపాదం…..

Share

సరిహద్దుల్లో ‘అమిత్’ ఉక్కుపాదం.
* అక్రమ కట్టడాలు నేలమట్టం కావాల్సిందే.
* 15 కిలోమీటర్ల పరిధిలో ఏ నిర్మాణమున్నా ఉపేక్షించొద్దు.
* హోంమంత్రి అమిత్ షా సంచలన ఆదేశాలు.
* కలెక్టర్లకు అదనపు బాధ్యతలు.
* జనాభా మార్పులపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు.
ఢిల్లీ, మహా.
దేశ సరిహద్దుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న వారిపై, సరిహద్దుల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ కట్టడాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు జిల్లాల భద్రతా పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఒక అత్యంత కీలకమైన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ అంతర్గత సరిహద్దుల నుంచి లోపలికి 15 కిలోమీటర్ల పరిధిలో ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే వాటిని తక్షణమే నేలమట్టం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఈ విషయంలో నూటికి నూరు శాతం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన కుండబద్దలు కొట్టారు. సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లు, అక్రమాలకు తావులేకుండా చూసేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లకు అదనపు బాధ్యతలను సైతం అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
సరిహద్దు జిల్లాల కలెక్టర్లు ఇకపై కంటిమీద కునుకు లేకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్రం తేల్చిచెప్పింది. సరిహద్దుల్లో జరిగే అన్ని రకాల బ్యాంకింగ్ లావాదేవీలపై కన్నేసి ఉంచాలని, అందులో చట్టపరమైన, ఆర్థికపరమైన నిబంధనలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో ముమ్మర తనిఖీలు చేపట్టి, ఆయా సంస్థలకు అసలు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న మూలాలను లాగాలని అధికారులను ఆదేశించింది. నకిలీ ఖాతాలు (మ్యూల్ అకౌంట్లు), నకిలీ కంపెనీల ముసుగులో జరిగే చీకటి వ్యాపారాలను ఎప్పటికప్పుడు పసిగట్టాలని సూచించింది. వీటన్నింటికీ మించి, నకిలీ ఆధార్ కార్డులతో చెలామణి అవుతున్న వారి ఆటకట్టించి, సరిహద్దుల గుండా జరిగే అక్రమ రవాణాను పూర్తిగా రూపుమాపాలని జిల్లా కలెక్టర్లకు హుకుం జారీ చేసింది. మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారి వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ల గుట్టు రట్టు చేసేందుకు లోతైన దర్యాప్తు చేయాలని, ఈ నేరాలు మళ్లీమళ్లీ జరగకుండా శాశ్వత పరిష్కారం అన్వేషించాలని కేంద్ర హోంశాఖ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
సరిహద్దుల్లో పహారా కాసే సైనికులతో పాటు స్థానిక పౌరులు, ప్రభుత్వ యంత్రాంగం, భద్రతా సంస్థలన్నీ కలిపి ఒక ‘360 డిగ్రీల భద్రతా కవచాన్ని’ ఏర్పాటు చేయాలని అమిత్ షా అధికారులకు దిశానిర్దేశం చేశారు. చొరబాట్లు, డ్రగ్స్ స్మగ్లింగ్, ఆక్రమణలు, ఉగ్రవాదులకు అందుతున్న నిధులు వంటి తీవ్రమైన సరిహద్దు నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బీఎస్ఎఫ్, సీబీడీటీ, ఎన్‌సీబీ వంటి కేంద్ర బలగాలతో పాటు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒకే తాటిపైకి వచ్చి సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా, సరిహద్దుల్లోని మారుమూల పల్లెలకు అండగా నిలవడానికి, అక్కడ మౌలిక సదుపాయాల లేమిని తరిమికొట్టడానికి ‘వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్’ను విజయవంతంగా అమలు చేయాలని చెప్పారు. ఆ గ్రామాల్లో ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు నూటికి నూరు శాతం అందేలా చూడాలన్నారు. సైబర్ నేరాలను దీటుగా ఎదుర్కోవడానికి ‘1930’ కాల్ సెంటర్ నంబర్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ పథకాలు, ఆదేశాల అమలుపై సరిగ్గా రెండు నెలల తర్వాత మళ్లీ సమీక్షించి, క్షేత్రస్థాయి ఫలితాలను అంచనా వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏ జిల్లాకు ఆ జిల్లా కచ్చితమైన ఫలితాలు చూపించాల్సిందేనని తేల్చిచెప్పారు.
ఇక దేశంలో అక్రమ వలసల సమస్య కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదని, వాటి ప్రభావం మన పట్టణాలు, పారిశ్రామిక వాడలు, గిరిజన ప్రాంతాలు, సామాజికంగా మరియు ఆర్థికంగా సున్నితమైన ప్రాంతాల వరకు పాకిపోయిందని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో చోటుచేసుకుంటున్న ఈ జనాభా మార్పులపై లోతైన అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని (హెచ్‌ఎల్‌సిడిసి) సర్కారు ఏర్పాటు చేసింది. దిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ కీలక కమిటీలో సెన్సస్ కమిషనర్‌తో పాటు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, డాక్టర్ షమికా రవి సభ్యులుగా వ్యవహరిస్తారు. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (విదేశీయులు-1) ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని అమిత్ షా వెల్లడించారు. ఈ కమిటీ దేశమంతా తిరిగి జనాభా మార్పులపై సుదీర్ఘంగా అధ్యయనం చేసి సరిగ్గా ఏడాదిలోగా తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని కేంద్రం ఒక అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించింది.