పెద్ది’లో నా పాత్ర పూర్తిగా భిన్నం.
* నటుడిగా ఎంతో నేర్చుకున్నా: రామ్ చరణ్.
ముంబై, మహా.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా, విలక్షణ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన రామ్ చరణ్.. ఈ సినిమాలో తన పాత్రపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన సినీ ప్రయాణంలో ఇప్పటివరకు పోషించని అత్యంత విభిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. “ఈ సినిమాలో ఎంతో మంది సీనియర్, గొప్ప నటీనటులతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. వారి నుంచి ఒక నటుడిగా ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను” అని చరణ్ తన అనుభవాలను వివరించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర వర్గాలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఇదే ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సీనియర్ నటుడు బొమన్ ఇరానీ.. రామ్ చరణ్ అంకితభావంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ కుస్తీ, క్రికెట్, పరుగు అనే మూడు విభిన్నమైన క్రీడల్లో అద్భుతంగా నటించారని, ఇక నాలుగో ఆటగా తనదైన శైలి డ్యాన్స్‌తో తెరపై అదరగొట్టారని ఆయన కొనియాడారు. సమాజంలో సరైన గుర్తింపు కోసం ఒక వ్యక్తి ఎంతటి కఠినమైన పోరాటమైనా చేస్తాడని, ఆ లక్ష్య సాధనలో అతను ఎంత దూరమైనా వెళ్లగలడనే బలమైన ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందిందని బొమన్ ఇరానీ వెల్లడించారు. క్రీడా నేపథ్యానికి రామ్ చరణ్ నటన తోడవడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.








