Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ పాలనలో రైతుల గోస….

Share

కాంగ్రెస్ పాలనలో రైతుల గోస.
* వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సరికాదు.
* ధాన్యం కొనుగోళ్లలో దళారీల చేతిలో నలిగిపోతున్న రైతాంగం.
* లక్ష్యం నిర్దేశించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సేకరించలేకపోయింది?
*తెలంగాణకు మోదీ ప్రభుత్వం రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తోంది.
* కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి.
హైదరాబాద్, మహా .
మార్పు పేరుతో రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తిచేసుకున్నా, తెలంగాణ రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పూ రాలేదని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత విచారకరమని, సమస్యలను పరిష్కరించడంలో ఈ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ప్రభుత్వం, రైస్ మిల్లర్లు, అధికారులు, దళారీల మధ్య రైతులు దారుణంగా నలిగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రయోజనాలను పక్కనబెట్టి వ్యవస్థ మొత్తం ఇతర ప్రయోజనాల చుట్టూ తిరుగుతోందని విమర్శించారు.
**లక్ష్యాలున్నా కొనుగోళ్లలో చేతగానితనం**
అన్ని వనరులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం, సరైన కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం వల్లే పంట చేతికొచ్చిన సమయంలో రైతులు వర్షాల బారినపడి నష్టపోతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ప్రజాప్రతినిధులు ‘రైతుల గోస – బీజేపీ భరోసా’ యాత్ర చేపట్టే వరకు కూడా కాంగ్రెస్ మంత్రులు కార్యాలయాలు దాటి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్లు కేంద్ర ప్రభుత్వం చేయడం లేదంటూ ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల నిర్వహణ, కొనుగోళ్లు, రైస్ మిల్లులకు తరలింపు వంటి ప్రాథమిక బాధ్యతలన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని గుర్తుచేశారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి 52.24 lakh మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించేలా రాష్ట్ర, కేంద్రాల మధ్య ఒప్పందం కుదిరినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేపట్టలేకపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ వైఫల్యాలను కేంద్రంపై మోపే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.
**దొడ్డుబియ్యం రైతులపై నిర్లక్ష్యం.. బోనస్ హామీ ఏమైంది?**
ప్రస్తుతం ప్రభుత్వం కేవలం సన్నబియ్యం సేకరణపైనే దృష్టి పెడుతూ, దొడ్డుబియ్యం పండిస్తున్న రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు దొడ్డుబియ్యాన్ని కొనుగోలు చేసేవని, ఇప్పుడు అక్కడ కూడా ఉత్పత్తి పెరగడంతో పరిస్థితులు మారాయన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించడంలో విఫలమైందని ఆరోపించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వంగడాల సాగుకు అవసరమైన విత్తనాలు అందించడం లేదని, రైతుల అవసరాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లు, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతోందని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో పది పంటలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత సన్నవడ్లకే పరిమితం చేసి, ఇప్పుడు రబీ పంట రైతులకు ఆ బోనస్ కూడా ఎందుకు ఎగ్గొట్టారో సమాధానం చెప్పాలన్నారు.
**నిధులన్నీ కేంద్రానివే.. ప్రచారం మాత్రం రాష్ట్రానిదా?**
ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి సారి వైఫల్యం చెందుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి దుస్థితి లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గన్నీ బ్యాగుల సరఫరా, రవాణా ఏర్పాట్లు, నిల్వ సదుపాయాల విషయంలో కనీసం ఆరు నెలల ముందు ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోవడం వల్లే రైతులు 20 నుంచి 40 రోజుల పాటు మార్కెట్లలో పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని దళారీలు మద్దతు ధర కంటే తక్కువకు అంటే రూ.1,700 కే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం కేవలం రూ.3,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసేదని, ప్రస్తుతం మోదీ ప్రభుత్వం తెలంగాణలోనే సుమారు రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తోందని గణాంకాలను వివరించారు.
రాష్ట్రంలో ఉచిత రేషన్ బియ్యం పంపిణీలో ప్రతి కిలోకు కేంద్ర ప్రభుత్వం రూ.41.73 ఖర్చు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.15.69 మాత్రమే ఖర్చు చేస్తోందని, మొత్తం వ్యయంలో 72.67 శాతం కేంద్రమే భరిస్తోందని స్పష్టం చేశారు. మండీ లేబర్ చార్జీలు, గన్నీ బ్యాగులు, రవాణా, కమిషన్లు, వడ్డీ వంటి అనేక వ్యయాలను కేంద్రమే భరిస్తున్నప్పటికీ.. పంపిణీ కేంద్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో లేకుండా, కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలతో ప్రచారం చేసుకోవడం సరైంది కాదన్నారు.
**అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి**
తెలంగాణలో ఉత్పత్తి అయ్యే నాణ్యమైన సన్నబియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి, అక్కడి నుంచి తక్కువ నాణ్యత గల బియ్యాన్ని కొనుగోలు చేసి ఇక్కడి పేదలకు పంపిణీ చేస్తున్నారనే బలమైన ఆరోపణలు ఉన్నాయని, బీఆర్ఎస్ హయాం నుంచి ప్రారంభమైన ఈ దోపిడీ విధానం ఇప్పటికీ కొనసాగుతోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరిచి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తక్షణమే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని, రైతు సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి రైతులకు ఎలా మేలు చేయాలనే దానిపై చర్చించాలి తప్ప, రైతు సమస్యలపై రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తక్కువ పెస్టిసైడ్స్ వినియోగంతో సాగు చేసేలా రైతుల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.