వైఎస్సార్ విగ్రహాల ధ్వంసంపై భగ్గుమన్న వైఎస్ షర్మిల.
* ఇది కక్ష సాధింపు చర్యలకు ఇది నిదర్శనం.
*పోలీసుల తీరుపై మండిపాటు.
* తక్షణమే కొత్త విగ్రహం పెట్టకపోతే ఆమరణ దీక్ష.
నంద్యాల,మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలపై ఉద్దేశపూర్వకంగా కొనసాగుతున్న దాడులు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే, అధికార కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం చోద్యం చూస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుణి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా శ్రీనివాస సెంటర్ వద్ద జరిగిన వైఎస్సార్ విగ్రహ ధ్వంస ఘటనను ఏపీ కాంగ్రెస్ పక్షాన ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి రాజకీయ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని ఆమె ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహాలపై జరుగుతున్న దాడుల పరంపరలో భాగంగా నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్‌లో పట్టపగలే ఓ సైకో విగ్రహంపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని షర్మిల మండిపడ్డారు. బహిరంగ ప్రదేశంలో ఈ ఘటన జరుగుతున్నప్పటికీ, అక్కడే ఉన్న పోలీసు యంత్రాంగం నిరోధించకపోవడం వారి వైఫల్యానికి అద్దం పడుతోందని విమర్శించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. ఆ వ్యక్తి మానసిక స్థితి బాగోలేదని, అతడు మనిషే కాదని, కాబట్టి సంయమనం పాటించాలంటూ ఉచిత సలహాలు ఇవ్వడం ఏమాత్రం తగదని షర్మిల పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు కేవలం ఒక సైకో మాత్రమే కాదని, అతడి వెనుక ఉన్న ఆ ప్రభావిత శక్తులు ఎవరో సమగ్ర విచారణ జరిపి తక్షణమే తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై దాడులను అరికట్టాల్సిన పూర్తి బాధ్యత ప్రస్తుత కూటమి ప్రభుత్వానిదేనని ఆమె స్పష్టం చేశారు. నంద్యాలలో ధ్వంసమైన పాత విగ్రహం స్థానంలో తక్షణమే కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించి తీరాలని షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ నంద్యాలలో అదే శ్రీనివాస సెంటర్ వద్ద వెంటనే వైఎస్సార్ విగ్రహాన్ని అధికారికంగా పునరుద్ధరించకపోతే, తాను ఏమాత్రం వెనక్కి తగ్గబోనని, విగ్రహం కూల్చిన అదే ప్రదేశంలో తాను ఆమరణ దీక్షకు దిగుతానని ముఖ్యమంత్రి చంద్రబాబుకు షర్మిల సంచలన హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, విగ్రహాలకు రక్షణ కల్పించాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.








