హ్యాకర్ దెబ్బకు దిగివచ్చిన సీబీఎస్ఈ.
* వెబ్‌సైట్‌లో లోపాలు ఉన్నట్లు అంగీకారం.
* సైబర్ నిపుణులతో డిజిటల్ వ్యవస్థ బలోపేతం.
* అధికారిక ప్రకటన విడుదల చేసిన బోర్డు.
ఢిల్లీ, మహా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆన్‌లైన్ మూల్యాంకన (ఓఎస్ఎం) పోర్టల్ వివాదంలో బోర్డు ఎట్టకేలకు దిగివచ్చింది. తమ సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన ‘ఆన్‌మార్క్’ పోర్టల్‌లో భద్రతా లోపాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఆ లోపాలను తక్షణం అరికట్టామని సీబీఎస్ఈ ఆదివారం (మే 31, 2026) నాడు అధికారికంగా ప్రకటించింది. నిసర్గ అధికారి అనే 19 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ బోర్డు వెబ్‌సైట్‌లోని డొల్లతనాన్ని ఆధారాలతో సహా బయటపెట్టడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గత కొద్ది రోజులుగా వస్తున్న ఈ ఆరోపణలను కేవలం తప్పుడు ప్రచారంగా కొట్టిపారేస్తూ వచ్చిన సీబీఎస్ఈ.. తాజాగా యూ-టర్న్ తీసుకుని తప్పును అంగీకరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
10, 12వ తరగతుల బోర్డు పరీక్షల జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేసేందుకు సీబీఎస్ఈ ఈ ఏడాది కొత్తగా ఆన్‌స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ తీసుకువచ్చింది. అయితే, ఎథికల్ హ్యాకింగ్ పట్ల ఆసక్తి ఉన్న 19 ఏళ్ల నిసర్గ.. ఈ పోర్టల్‌ను సులభంగా హ్యాక్ చేసి అందులోని కనీస భద్రతా ప్రమాణాల లేమిని వెలుగులోకి తెచ్చాడు. వెబ్‌సైట్ కోడ్‌లోనే ఉన్న ‘మాస్టర్ పాస్‌వర్డ్’ సాయంతో, ఎలాంటి ఓటీపీ లేకుండానే ఎవరైనా సరే మూల్యాంకన చేసే ఉపాధ్యాయుడి ఖాతాలోకి చొరబడి విద్యార్థుల మార్కులను ఇష్టానుసారంగా మార్చే వీలుందని ఆ బాలుడు ఫిబ్రవరిలోనే గుర్తించి కేంద్ర సైబర్ భద్రతా విభాగం (సెర్ట్-ఇన్)కి ఫిర్యాదు చేశాడు. దీనికి తోడు 2026 విద్యా సంవత్సరానికి చెందిన దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలు, ప్రశ్నపత్రాలు ఆన్‌లైన్‌లో ఎలాంటి లాగిన్ లేకుండా పబ్లిక్‌గా డౌన్‌లోడ్ చేసుకునేలా ఉన్నాయని నిసర్గ సామాజిక మాధ్యమాల ద్వారా ఆధారాలతో సహా నిరూపించాడు.
తొలుత ఈ ఆరోపణలను సీబీఎస్ఈ తీవ్రంగా ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న డొమైన్ కేవలం ‘టెస్టింగ్’ కోసమే వాడామని, అసలు మూల్యాంకన పోర్టల్ అత్యంత భద్రంగా ఉందని వాదించింది. కానీ, హ్యాకర్లు మరింత లోతైన సాంకేతిక ఆధారాలు బయటపెట్టడంతో సీబీఎస్ఈ దిగిరాక తప్పలేదు. పోర్టల్‌లో పబ్లిక్ డొమైన్ ద్వారా ఫ్లాగ్ చేయబడిన లోపాలను నివారించామని, వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, ఐఐటీలకు చెందిన అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందంతో గత కొన్ని రోజులుగా ఈ వ్యవస్థను మరింత సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌పైకి మార్చే పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు సీబీఎస్ఈ వివరించింది. ఈ భద్రతా లోపాలను తమ దృష్టికి తీసుకువచ్చిన ఎథికల్ హ్యాకర్లు, పౌరులకు సీబీఎస్ఈ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి లోపాలు గుర్తిస్తే నేరుగా తమకు ఈ-మెయిల్ చేయాలని సూచించింది. ఏదేమైనా, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న మూల్యాంకన ప్రక్రియలో ఇలాంటి కనీస భద్రతా లోపాలు బయటపడటం విద్యావ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశమైంది.








